MLA Komatireddy: ఇది నా మాట.. నా మాటే శాసనం.. అని బాహుబలి సినిమాలోని మహారాణి వాక్కు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాటే అమలవుతుంది. ఆయన మాటే నెగ్గింది. ఆయన చెప్పిన తరహాలోనే కొత్త మద్యం దుకాణాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆయన చెప్పిన వేళలనే పాటిస్తున్నాయి. మొత్తంగా నియోజకవర్గం పరిధిలో ఆయన విధించిన షరతులు అమలవుతున్నాయి.
మద్యం దుకాణాలు ఊరి చివరన ఉండాలి.. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే అమ్మకాలు చేపట్టాలి.. పర్మిట్ రూములకు సాయంత్రం ఆరు గంటల తర్వాతే అనుమతి ఇవ్వాలి.. ఇవీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విధించిన ప్రధాన షరతులు. ఎమ్మెల్యేతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాయో, మున్ముందు ఆశతోనో ఏమో కానీ, డిసెంబర్ 1 నుంచి ప్రారంభమైన మద్యం దుకాణాల యాజమాన్యాలు ఈ షరతులను తూచ తప్పక పాటిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే తన మాటే నెగ్గించుకున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Nadendla Manohar: రైతులకు శుభవార్త.. ధాన్యం సమస్యలపై నేరుగా 1967కు ఫోన్ చేయండి!
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి నియోజకవర్గ పరిధిలో దరఖాస్తుదారులతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆయా సూచనలు తూచ తప్పకుండా పాటించాలని, అలాంటి వారే టెండర్లు వేయాలని, లేదంటే వెళ్లిపోవాలంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. బెల్ట్ షాపులు అనేవే ఉండొద్దని, మద్యం దుకాణదారులు సిండికేట్గా ఏర్పడవద్దని, ఊరి చివరే మద్యం అమ్మకాల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, పర్మిట్ రూములకు అనుమతులు ఉండవని, ఒకవేళ్ల సాయంత్రం ఆరు తర్వాతే ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పుడు అదే అమలవుతున్నది. రానురాను ఒకవేళ ఎమ్మెల్యేలో మార్పు వచ్చినా, చట్టపరంగా ఏమైనా అనుమతులు తెచ్చుకున్నా కొన్ని మార్పలు జరగవచ్చనే ఆశతో యాజమాన్యాలు ఉన్నాయి.

