Anirudh Reddy: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించే విషయంలో వివక్ష చూపుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మంత్రులు, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు, నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, “మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తేనే కదా… మేము కూడా భవిష్యత్తులో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అయ్యేది” అని వ్యాఖ్యానించారు.
జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతకైనా:
తన నియోజకవర్గం జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తానని అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేశారు. “జడ్చర్ల ప్రజలు నన్ను మరో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించండి. అప్పుడు నేను కూడా సీఎం అభ్యర్థి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ శక్తి నాకు వస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
అంటే, ఎమ్మెల్యేగా గెలిచిన తమకు నిధులు రాక అభివృద్ధి ఆగుతుందని, అందుకే అధికారం దక్కించుకోవాలని చూస్తున్నామని ఆయన చెప్పకనే చెప్పారు. ఒక ప్రజాప్రతినిధిగా నిధుల విషయంలో వివక్ష ఉండకూడదని, అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
అనిరుధ్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సొంత పార్టీలోని నాయకులను ఉద్దేశించే చేసినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా నిధుల విషయంలో తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై అధికార పార్టీలో చర్చ జరిగే అవకాశం ఉంది.