Nageswara Rao: తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులకు, జిన్నింగ్ మిల్లులకు ఊరట లభించింది. పత్తి కొనుగోళ్లపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని, నవంబర్ 19 నుంచి యథావిధిగా కొనుగోళ్లు పునఃప్రారంభమవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన కఠిన నిబంధనలపై కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నవంబర్ 17 నుంచి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, మంత్రి తుమ్మల చొరవ తీసుకుని చర్చలు జరపడం కీలక పరిణామంగా మారింది.
సఫలమైన చర్చలు, నిబంధనలపై ఒత్తిడి
పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిన్నింగ్ మిల్లుల సమస్యలపై, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించారు.
వంబర్ 17న మంత్రి తుమ్మల, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఐ కొనుగోళ్లకు కేంద్రం విధించిన తేమ నిబంధనలను సడలించాలని, అలాగే ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామన్న షరతును వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో ఇవాళ మరోసారి సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా మరియు జిన్నింగ్ మిల్లర్ల అసోషియేషన్తో మంత్రి తుమ్మల చర్చలు జరిపారు. ఈ చర్చలు విజయవంతమయ్యాయి.
నవంబర్ 19 నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు జరుగుతాయని, త్వరలోనే అన్ని జిల్లాలలో జిన్నింగ్ మిల్లులు ప్రారంభం అవుతాయని మంత్రి చెప్పారు. జిన్నింగ్ మిల్లర్లకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయ ఉచ్చులో పడొద్దు: మంత్రి తుమ్మల
పత్తి కొనుగోళ్ల సమస్యపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని మంత్రి తుమ్మల రైతులనుద్దేశించి మాట్లాడారు. రైతులు ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడొద్దని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
భారీగా సాగు, తక్కువగా కొనుగోళ్లు
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో ఏకంగా 45.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. సుమారు 27 లక్షల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. అయితే, ఇప్పటివరకు సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ల ద్వారా కేవలం 67 వేల మంది రైతుల నుంచి 1.18 లక్షల టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేయగలిగింది.
‘కపాస్ కిసాన్ యాప్’ స్లాట్ బుకింగ్ విధానం, కొనుగోలు కేంద్రాలను దశలవారీగా తెరవడం వంటి కఠిన నిబంధనల వల్లే రైతులతో పాటు జిన్నింగ్ మిల్లులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. తాజా చర్చల అనంతరం, నిబంధనలలో సడలింపులు ఉంటాయని రైతులు, మిల్లర్లు ఆశిస్తున్నారు.

