Seethakka: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మేడారం జాతరపై కొందరు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వచ్చే ఏడాది జరగబోయే మహాజాతర పనులను పర్యవేక్షించడానికి ఆమె మేడారంలో పర్యటించారు.
మేడారంలో మంత్రి పర్యవేక్షణ
మంత్రి సీతక్క మేడారంలో ఎస్పీ శబరీష్‌తో కలిసి బైక్‌పై తిరుగుతూ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజుల్లోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. కొందరు “గద్దెలను మారుస్తున్నారు” అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
“తుది డీపీఆర్ ఇంకా సిద్ధం కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపిన తర్వాతే డిజైన్లు ఫైనల్ అవుతాయి” అని ఆమె స్పష్టం చేశారు. ఈ మహాజాతరకు ₹150 కోట్లు ప్రజా ప్రభుత్వం కేటాయించిందని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకుని, జాతర విజయవంతం కావడానికి సహకరించాలని ఆమె కోరారు.

