Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంత్రి నారా లోకేశ్ వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయమని స్పష్టంగా చెప్పినప్పటికీ, వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, తన తల్లిని అవమానించిన వారు ఇప్పుడు గౌరవం గురించి మాట్లాడటం సిగ్గుచేటని లోకేశ్ మండిపడ్డారు. ఈ రోజు శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
మంత్రి నారా లోకేశ్, వైసీపీ నేతలు మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని పేర్కొన్నారు. తల్లిని అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నేను స్వయంగా చూశాను. నా తల్లి భువనేశ్వరిని నిండు సభలో అవమానించినప్పుడు ఆమె కోలుకోవడానికి మూడు నెలలు పట్టింది. మా మహిళలపై కేసులు పెట్టినప్పుడు మీరు ఏం చేశారు అని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను సూటిగా ప్రశ్నించారు. వైసీపీ నేతలు మహిళలను ఇప్పటికీ అవమానిస్తున్నారని, వారికి గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
బొత్స సత్యనారాయణ, లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన లోకేశ్, తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, బొత్స సభలో లేనప్పుడు తాను మాట్లాడినట్లు గుర్తు చేశారు. మహిళలను తిట్టడంలో ఆనందం పొందే వ్యక్తులం మేము కాదు అని వైసీపీ సభ్యులకు చురకలు వేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై స్పష్టత
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. సభలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాం. ప్రభుత్వం తరఫున మాట ఇచ్చాం. అయినా వైసీపీ నేతలకు అర్థం కావడం లేదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసత్య ప్రచారం చేసి పరిశ్రమలను తరిమేసిందని గుర్తుచేశారు.
Also Read: Rajanna Sircilla: సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో పరిశ్రమల పురోగతి
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులపై చర్చలో లోకేశ్ మాట్లాడుతూ, 2014-19 మధ్య అనేక పరిశ్రమలను తెచ్చామని చెప్పారు. కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా తలసరి ఆదాయం రూ.70,000 నుంచి రూ.2.30 లక్షలకు పెరిగింది. రేణిగుంటలో టీసీఎల్, గన్నవరంలో హెచ్‌సీఎల్ పరిశ్రమలను ఏర్పాటు చేశాం. కానీ వైసీపీ ప్రభుత్వం టీసీఎస్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది అని ఆయన విమర్శించారు.
వైసీపీ పాలనలో లులూ, అమరరాజా వంటి సంస్థలు రాష్ట్రం వదిలి వెళ్లాయని, సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలను రద్దు చేశారని ఆరోపించారు. ఒక్క కంపెనీ తీసుకురావడం ఎంత కష్టమో మాకు తెలుసు. మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం అని లోకేశ్ తెలిపారు.
కొత్త పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు
ప్రస్తుత ప్రభుత్వం 16 నెలల్లో రూ.10.4 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం 340 ఎంవోయూలు చేసుకుందని, మరో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులకు చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ వెల్లడించారు. కర్నూలులో దేశంలోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశామని, విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ ద్వారా 25 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి అంగీకరించిందని, ఆదిత్య మిత్తల్‌తో స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. దావోస్‌లో కాగ్నిజెంట్‌కు ఎకరా భూమిని రూపాయికి ఇస్తామని హామీ ఇచ్చాను. దీంతో వారు విశాఖలో పెట్టుబడులకు అంగీకరించారు అని ఆయన వివరించారు.
వైసీపీ పాలనలో పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లాయని, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని లోకేశ్ ఆరోపించారు. మహిళలను గౌరవించడం మాకు నేర్పిన సంస్కృతి. కానీ వైసీపీ నేతలు మహిళలను అవమానిస్తూ, అసత్య ప్రచారం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, 25 వరల్డ్ క్లాస్ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.