Union Cabinet Meeting: దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం కాబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కేబినెట్ సమావేశమవుతోంది. దీనితో పాటు, కుల గణన వంటి భావోద్వేగ అంశాలపై చర్చ జరగనుండటంతో, ఈ సమావేశం అన్ని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ భేటీ ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో నిర్వహించనున్నారు. ఇందులో కేంద్ర మంత్రులే కాకుండా సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు కూడా హాజరుకాబోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల ప్రధాని మోడీ సహచరులకు పూర్తిస్థాయిలో వివరించనున్నారు. దేశ భద్రతపై దృష్టి పెట్టిన ఈ చర్యను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై కమ్యూనికేషన్ కార్యాచరణపై చర్చ జరగనుంది.
ఇక మరోవైపు, జనాభా లెక్కలు మాత్రమే కాకుండా కుల గణన చేపట్టాలన్న కేంద్ర ఆలోచనపై కూడా ఈ సమావేశంలో చర్చకు అవకాశం ఉంది. ఇటీవలే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. సామాజిక న్యాయ పరిరక్షణ కోణంలో కుల గణన అనివార్యమని భావిస్తున్న కేంద్రం,కుల గణనపై నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు కేంద్రం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేస్తోందన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది
ఇకనెంతైనా… ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇది ఏడాది ముగింపు దశలో జరుగుతున్న సమావేశం కావడం, ప్రధానమంత్రి మోడీ సుదీర్ఘ కార్యాచరణ ప్రణాళికను పరిచయం చేసే అవకాశం ఉండడం… తదితర అంశాలతో ఈ కేబినెట్ భేటీపై అంచనాలు పెరిగిపోయాయి.