Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆరు రోజుల పర్యటన కోసం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం మేరకు ‘స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో’ పాల్గొనేందుకు మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా హై కమిషనర్ ఆహ్వానంపై సిడ్నీ వచ్చారు. సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ ఆస్ట్రేలియా అధ్యక్షుడు విజయ్, ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో తెలుగు ఎన్.ఆర్.ఐలు కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. కేవలం సిడ్నీ నుంచే కాకుండా, బ్రిస్బేన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్‌బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో విచ్చేసి లోకేష్‌ను కలిశారు. లోకేష్ వారికి ఆప్యాయంగా పలకరించి, వారితో ఫొటోలు దిగారు. స్వాగతం పలుకుతూ సిడ్నీలో టవర్ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతోపాటు, విమానాశ్రయం టీడీపీ జెండాలతో సందడిగా మారింది.
Also Read: Pakistan-Afghanistan: పాక్-అఫ్గాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!
ఆరు రోజుల పర్యటన లక్ష్యాలు:
మంత్రి లోకేష్ నేటి నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో ముఖ్యంగా రెండు ప్రధాన లక్ష్యాలపై దృష్టి సారించనున్నారు:
విద్యారంగ అధ్యయనం: లోకేష్ ఆస్ట్రేలియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించి, అక్కడ అనుసరిస్తున్న అధునాతన బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు.
పెట్టుబడుల ఆకర్షణ: నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం పెట్టుబడిదారులను ఆకర్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. దీని కోసం సిడ్నీతో పాటు మెల్‌బోర్న్ నగరాల్లో కూడా ఆయన రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి, ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన ఆహ్వానించనున్నారు.
తెలుగు డయాస్పోరా సమావేశం:
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా, లోకేష్ ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో జరిగే తెలుగు డయాస్పోరా సమావేశంలో ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై, ప్రవాసాంధ్రుల సహకారంపై మాట్లాడే అవకాశం ఉంది.