Nara Lokesh: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీకి వచ్చిన దేశ, విదేశీ ఇన్వెస్టర్స్ అందరూ వెనక్కి వెళ్లిపోయారు. కొత్త పరిశ్రమలు కాదుకదా.. అప్పటివరకూ ఉన్న పరిశ్రమలు కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో వెనక్కి వెళ్ళిపోయినా ఇన్వెస్టర్స్ తో పాటు కొత్తగా పెట్టుబడులు సాధించడం కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పుడు వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా మంత్రి నారాలోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లారు. తన పర్యటనలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఇన్వెస్టర్స్ తో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు.. ఇక్కడే పెట్టుబడి పెడితే వచ్చే ప్రయోజనాలు ఈ సమావేశంలో ఇన్వెస్టర్స్ కి వివరించారు.
మన దేశం నుంచి అమెరికా వెళ్లి అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికీ ముందుగా ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అనే విషయంపై వివరణ ఇచ్చారు. అలాగే అమెరికన్ పారిశ్రామిక వేత్తలను ఏపీలో వ్యాపారం చేయడానికి ఉన్న అవకాశాలను వివరిస్తూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ఏపీలో అందుబాటులో మెరుగైన రవాణాసౌకర్యాలు ఉన్నాయనీ.. వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉన్న తీరప్రాంతానికి మంచి రోడ్ కనెక్టివిటీ అందుబాటులో ఉందని లోకేష్ వారికి వివరించారు. ప్రస్తుతం భారతదేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి అన్నివిధాలుగానూ అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని డ్రాప్ బాక్స్ కో ఫౌండర్ సుజయ్ జస్వా ఇంట్లో ఈ సమావేశం నిర్వహించారు. ఇక్కడ చాలామంది పారిశ్రామిక వేత్తలతో లోకేష్ భేటీ అయ్యారు. అమరావతి పరిసరాల్లో 3 బిలియన్ డాలర్లతో ప్రభుత్వ రంగంలోనూ అదేవిధంగా 4.5 బిలియన్ డాలర్లతో ప్రయివేట్ రంగంలోనూ వివిధ నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని. అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారికీ వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, మూలపేట ప్రాంతాల్లో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్టులు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చే ఏడాదిన్నరలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయని లోకేష్ వారికి తెలిపారు. అమరావతిలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో కొత్తగా ఏఐ సంస్థల ఏర్పాటుకు అవరమైన మ్యాన్ పవర్ అందుబాటులోకి వస్తుందని మంత్రి లోకేష్ వారికి స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం అన్నివిధాలుగా అనుకూలంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అందువల్ల ఏపీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని పారిశ్రామిక వేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.