Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ’70వ ప్రజాదర్బార్’. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజానీకం, వివిధ సంఘాల ప్రతినిధులు వేలాదిగా తరలిరావడంతో టీడీపీ కేంద్ర కార్యాలయం మరోసారి జనసంద్రంగా మారింది.
కిలోమీటరు మేర క్యూలైను, ఓపికగా లోకేశ్
చాలా కాలం తర్వాత లోకేశ్ పూర్తి స్థాయిలో ప్రజాదర్బార్ నిర్వహించడంతో ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనను కలిసేందుకు ఉత్సాహం చూపారు. మంత్రిని కలిస్తే తమ సమస్య పరిష్కారమవుతుందనే భరోసాతో ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి దాదాపు కిలోమీటరు మేర ప్రజలు క్యూలైనులో నిలబడ్డారు.
దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ 4 వేల మందికి పైగా ప్రజలను స్వయంగా కలిసి, వారి సమస్యలను చాలా ఓపికగా విన్నారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ వినతిపత్రాలు స్వీకరించారు.
సమస్య తీవ్రతను బట్టి కొన్ని సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఎంత సమయమైనా అందరినీ కలవాలనే నిర్ణయంతో లోకేశ్ వ్యవహరించడంతో, ప్రజాదర్బార్ రాత్రి బాగా పొద్దు పోయే వరకు కొనసాగేలా కనిపించింది. క్యూలైనులో నిల్చున్న ప్రజలకు టీడీపీ కార్యకర్తలు మంచినీరు, బిస్కెట్లు, మజ్జిక ప్యాకెట్లను సరఫరా చేశారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్ల ఢీ.. పలువురి మృతి
వైసీపీ పాలనలో అన్యాయాలపై ఫిర్యాదులు అధికం
ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో అధికశాతం గత వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్న కష్టాలు, అన్యాయాలకు సంబంధించినవే కావడం గమనార్హం. గత ప్రభుత్వంలో తమపై అక్రమ కేసులు బనాయించారని, ఆస్తులు లాక్కున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త దనపాన హరికృష్ణ తన భూమిని వైసీపీ నేతల ప్రోద్బలంతో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మెరిగల రవిబాబు, తన వారసత్వ భూమిని వైసీపీ కార్యకర్త కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని వాపోయారు. టీడీపీ సానుభూతిపరుడిననే కారణంతో అతిథి అధ్యాపకుడి ఉద్యోగం నుంచి తొలగించారని కర్నూలుకు చెందిన ఉలిద్ర రవి గోడును వెళ్లబోసుకున్నారు.
ఉద్యోగ, కార్మిక సంఘాల వినతులు
ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు: వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ (మేల్) పోస్టులను భర్తీ చేయాలని పారా మెడికల్ హెల్త్ అసిస్టెంట్ అసోసియేషన్ కోరింది. ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్స్‌లో పనిచేస్తున్న 23,500 మంది కాంట్రాక్టు కార్మికుల సేవలను క్రమబద్ధీకరించి, వేతన సవరణ చేయాలని ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గూడెంలలో కొత్త పాఠశాలల మంజూరు, చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు వంటి విజ్ఞప్తులు కూడా వచ్చాయి.
కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే బాధ్యత తమదని, అందరికీ అండగా నిలుస్తామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు. వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

