Minister Jadhav: దేశంలో మహిళల్లో క్యాన్సర్ వ్యాప్తి అధికంగా ఉండటంతో, కేంద్ర ప్రభుత్వం దీనిని నిరోధించేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. క్యాన్సర్‌ను ఎదుర్కొనే టీకా మరో ఐదు నుంచి ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రవు జాదవ్ తెలిపారు. మంగళవారం ఛత్రపతి శంభాజీనగర్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, తొమ్మిది నుంచి 16 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.
జాదవ్ మాట్లాడుతూ, “దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సక్రమ చర్యలు తీసుకుంటోంది. 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంకా, ముందుగా క్యాన్సర్‌ను గుర్తించి తగిన చికిత్స అందించేందుకు ‘డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు’ ఏర్పాటు చేస్తున్నాం” అని తెలిపారు.
అదనంగా, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, తద్వారా రోగులకు చికిత్స ఖర్చు తగ్గుతుందని చెప్పారు. క్యాన్సర్ వ్యాక్సిన్‌పై పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయని వివరించారు.
ఈ టీకా రొమ్ము, నోటి మరియు గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధించడంలో సహాయపడుతుందని మంత్రి తెలిపారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుండటంతో, లక్షలాది మంది బాలికలు దీని ద్వారా రక్షణ పొందే అవకాశముంది.