Microsoft: మహమ్మారి తర్వాత ఐటీ రంగంలో విస్తృతంగా అమలైన వర్క్ ఫ్రం హోమ్ విధానానికి పెద్ద టెక్ కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి గుడ్‌బై చెబుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కూడా ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు కొత్త విధానాన్ని ప్రకటించింది.
కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మాన్ బ్లాగ్ పోస్టులో వెల్లడించిన వివరాల ప్రకారం, వచ్చే ఏడాది నుంచి ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పనిచేయడం తప్పనిసరి కానుంది. ఈ విధానం దశలవారీగా అమలు కానుంది.
అమలు ప్రణాళిక
మొదటగా వాషింగ్టన్ రాష్ట్రంలోని రెడ్‌మండ్ ప్రధాన కార్యాలయంకు సమీపంలో ఉన్న ఉద్యోగులపై ఈ నిబంధన అమలవుతుంది.ఆపై అమెరికాలోని ఇతర ప్రాంతాలు, చివరగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామని కంపెనీ స్పష్టం చేసింది. ప్రధాన కార్యాలయం నుంచి 50 మైళ్ల పరిధిలో నివసించే ఉద్యోగులు 2026 ఫిబ్రవరి చివరి నాటికి తప్పనిసరిగా వారానికి మూడు రోజులు ఆఫీసులో ఉండాల్సి ఉంటుంది. అమెరికా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగుల కోసం షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. అంతర్జాతీయ ఉద్యోగుల కోసం ప్రణాళిక వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది.
ఇది కూడా చదవండి: iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. సరికొత్త ఫీచర్లు, స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్న యాపిల్
ఐటీ రంగంలో కొత్త ట్రెండ్
కోవిడ్ కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోమ్ విధానం ఉద్యోగులకు సౌలభ్యాన్ని కలిగించినా, ప్రస్తుతం అనేక సంస్థలు తిరిగి ఆఫీస్ కల్చర్ వైపు మళ్లుతున్నాయి. అమెజాన్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను ఆఫీసులోనే పనిచేయడానికి ప్రోత్సహిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఈ జాబితాలో తాజాగా చేరింది. ఈ చర్యలతో ఐటీ రంగంలో మరల ఆఫీస్ వర్క్ మోడల్ సాధారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.