Michael Clarke: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తన ముక్కు నుండి చర్మ క్యాన్సర్‌ను తొలగించడానికి అతను ఆరవ సారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. క్లార్క్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శస్త్రచికిత్స అనంతరం ఫోటోను పోస్ట్ చేస్తూ, తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు. “చర్మ క్యాన్సర్ అనేది నిజం! ముఖ్యంగా ఆస్ట్రేలియాలో. ఈ రోజు నా ముక్కు నుండి మరొక దాన్ని తొలగించారు. మీ చర్మాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని ఇది ఒక స్నేహపూర్వక హెచ్చరిక. నివారణే ఉత్తమ చికిత్స, కానీ నా విషయంలో, క్రమం తప్పకుండా తనిఖీలు, ముందస్తుగా గుర్తించడం చాలా కీలకం. నా డాక్టర్ బిష్ సోలిమాన్ దానిని త్వరగా గుర్తించినందుకు నేను చాలా కృతజ్ఞుడిని” అని రాసుకొచ్చారు.
Also Read: Viral Video: డబ్బుల వర్షం కురిపించిన కోతి.. షాక్‌లో రైతు
క్లార్క్ తన కెరీర్ లో పలుమార్లు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. 2006లో మొదటిసారిగా అతనికి చర్మ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తరువాత 2019లో కూడా ముఖంపై మూడు నాన్-మెలనోమా క్యాన్సర్లను తొలగించుకున్నారు. మైఖేల్ క్లార్క్ గతంలో కూడా చర్మ క్యాన్సర్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సూర్యరశ్మి నుండి తమను తాము కాపాడుకోవాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరుతుంటారు. తాను తన కూతురికి మంచి ఉదాహరణగా నిలవాలని, అందుకే ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటానని చెప్పారు. ఈ తాజా ఘటన ద్వారా, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన ప్రాముఖ్యతను క్లార్క్ మరోసారి నొక్కి చెప్పారు.