Mexico: మెక్సికోలో జరిగిన ఒక సంఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. దేశ అత్యున్నత పదవిలో ఉన్న మహిళకే ప్రజల్లోనే లైంగిక వేధింపులు జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ దారుణం వీడియో రూపంలో బయటకు రావడంతో సోషల్ మీడియా అంతటా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి.
ఏం జరిగింది
మంగళవారం మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఓ ప్రజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జనాలతో మాట్లాడుతుండగా వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకడమే కాకుండా, ముద్దుపెట్టుకునేందుకు కూడా ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. కానీ అతడు మళ్లీ ముందుకు రావడంతో, క్లాడియా స్వయంగా అతడిని దూరం నెట్టేసింది. ఈ ఘటన కెమెరాల్లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అధికారుల సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కాగా, అధ్యక్ష కార్యాలయం అధికారిక ప్రకటనను ఇంకా విడుదల చేయలేదు.
మహిళల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ
ఇలాంటి సంఘటనలు అధికారం, ప్రాధాన్యం ఉన్న మహిళలు కూడా లైంగిక వేధింపుల ప్రమాదం నుంచి బయటకు రాకపోవడాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి. ఇది మహిళల భద్రత, ప్రజాస్థలాల్లో లైంగిక నేరాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

