Mehul Choksi: గీతాంజలి జెమ్స్ యజమాని, రూ.13,850 కోట్ల బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ, తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలో నివసిస్తున్నాడు. అతను “F రెసిడెన్సీ కార్డ్” పై బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో ఉంటున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం తర్వాత అతను 2018లో భారతదేశం నుండి ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోయాడు. ఈ నేపథ్యంలో చోక్సీని భారతదేశానికి తీసుకురావడానికి, అప్పగింత ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు బెల్జియం ప్రభుత్వాన్ని కోరారు.
ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాడీ హౌస్ బ్రాంచ్‌లో మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ రూ.13,850 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పాస్‌పోర్ట్ సస్పెండ్ అయినందున భారతదేశానికి తిరిగి రాలేకపోతున్నానని చోక్సీ గతంలో సాకు చెప్పాడు.
2018లో భారతదేశం విడిచి వెళ్లే ముందు, చోక్సీ 2017లోనే ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం తీసుకున్నాడు. మెహుల్ చోక్సీ ఆరోగ్యం సరిగా లేదని పేర్కొంటూ భారత్ కు రావడానికి పదే పదే నిరాకరించాడు. కొన్నిసార్లు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే కోర్టుకు హాజరు కావడం జరుగుతోంది. భారతదేశంలోని అతని అనేక ఆస్తులను కూడా జప్తు చేశారు.
ఇది కూడా చదవండి: Jammu And Kashmir: జమ్మూలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులు
చోక్సీ మే 2021లో ఆంటిగ్వా నుండి అదృశ్యమై పొరుగున ఉన్న డొమినికా చేరుకున్నాడు. అతన్ని ఇక్కడే అరెస్టు చేశారు. అతన్ని అప్పగించడానికి CBI బృందం డొమినికాకు చేరుకుంది, కానీ అంతకు ముందే అతనికి బ్రిటిష్ రాణి ప్రివీ కౌన్సిల్ నుండి ఉపశమనం లభించింది. తరువాత అతన్ని మళ్ళీ ఆంటిగ్వాకు అప్పగించారు. అయితే, మెహుల్ చోక్సీ 51 రోజులు డొమినికా జైలులో గడపాల్సి వచ్చింది.
ఇక్కడ అతను ఆంటిగ్వాకు వెళ్లి అక్కడి న్యూరాలజిస్ట్ నుండి చికిత్స పొందాలనుకుంటున్నానని వాదించాడు. ఆంటిగ్వా చేరుకున్న కొన్ని రోజుల తర్వాత, డొమినికా కోర్టు చోక్సీపై నమోదైన కేసులను కూడా కొట్టివేసింది.
మీడియా నివేదికల ప్రకారం, మెహుల్ చోక్సీ బెల్జియంలో నివాసం పొందడానికి తప్పుడు – నకిలీ పత్రాలను సమర్పించాడు. అతను తన భారతీయ, యాంటిగ్వా పౌరసత్వాన్ని దాచిపెట్టి, తప్పుడు సమాచారం ఇచ్చి భారతదేశానికి రాకుండా తప్పించుకుంటున్నాడు. మెహుల్ చోక్సీ ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు కూడా ఒక రిపోర్ట్ పేర్కొంది.

