Meesala Pilla Song: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మీసాల పిల్ల’ (Meesala Pilla) ఫుల్ సాంగ్ వచ్చేసింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) నుండి ఈ పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ పాట ప్రోమో ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరంజీవి స్టైలిష్ లుక్, ఆయన డాన్స్‌లోని గ్రేస్, సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ్ వాయిస్‌కి ఫిదా అయిన వారంతా పూర్తి పాట కోసం ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను మరింతగా అలరిస్తోంది.
Also Read: Sankranthiki Vasthunnam Remake: హిందీలో సంక్రాంతికి వస్తున్నాం.. సక్సెస్ అవుతుందా?
చిరు డ్యాన్స్, నయనతార అందాలు
చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరు, నయన్ భార్యాభర్తలుగా కనిపిస్తారు. “హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా…” అంటూ సాగే ఈ పాటలో, చిరంజీవి తనపై అలిగిన నయనతారను సరదాగా ఆటపట్టిస్తూ, బుజ్జగించే సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పాటలో మెగాస్టార్ తన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో అద్భుతంగా ఆకట్టుకోగా, నయనతార చాలా అందంగా కనిపించారు.
ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ల గాత్రం ఈ పాటకు మరింత ప్రాణం పోసింది. సరళమైన పదాలతో కూడిన సాహిత్యం అందరూ సులభంగా పాడుకునేలా ఉంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌తో మెగా అభిమానులను ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ను మేకర్స్ వేగవంతం చేశారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫుల్ సాంగ్ విడుదల సినిమాపై అంచనాలను మరింత పెంచింది.