Meena: దక్షిణాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన మీనా రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? ఆమె బీజేపీలోనే చేరనున్నారా? అంటే నిజమేనేమోననే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె ఇటీవల భారత ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌ను ఢిల్లీలో కలవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఆమె ఉపరాష్ట్రపతితో దిగిన ఫొటో వైరల్‌గా మారింది. దీంతో ఆమె నిజంగానే రాజకీయాల్లోకి వెళ్తారా? లేదా? అన్న విషయంపై ఫిలిం వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది.
Meena: ప్రముఖ నటి మీనా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ వంటి పలు భాషా చిత్రాల్లో నటించారు. 45 ఏళ్లపాటు బాలనటి నుంచి అగ్ర కథానాయిగా ఎదిగిన ఆమె విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఆమె భర్త విద్యాసాగర్ 2022లో అనారోగ్యంతో చనిపోయారు. ఆమెకు ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం తన కూతురు నైనికతో కలిసి ఉంటున్నారు. నైనిక కూడా ఇటీవల విజయ్ నటించిన తెరి చిత్రంలో (తెలుగులో పోలీసోడు) బాలనటిగా కనిపించింది.
Meena: ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మీనా.. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఆమె రాజకీయ రంగంలోకి వెళ్లనున్నారని ప్రచారం మొదలైంది. ఈ ఘటనతో ఆమె బీజేపీలోకే వెళ్తారని ప్రచారం జరుగుతున్నది.
Meena: బీజేపీ కూడా తమిళనాడు రాష్ట్రాన్ని వశం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నది. మరో ఏడాదిలో జరగనున్న తమిళనాడులో విశేష జనాదరణ ఉన్న మీనాను పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో బీజేపీ ఉన్నది. ప్రత్యర్థుల బలాన్ని ఢీకొనాలంటే.. ఇలాంటి జనాదరణ కలిగిన వారిని పార్టీలో చేర్చుకోవాలనే ప్లాన్‌ను అమలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. వాస్తవంగా రాజకీయాల్లోకి రావాలనే కోరిక మీనాకు లేకున్నా.. బీజేపీ పెద్దల మాట కాదనలేక ఆమె చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలో దీనిపై మీనా స్పందిస్తేనే ఈ అయోమయానికి తెరపడనున్నది.