Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కార్యకలాపాలపై భద్రతా బలగాలు ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని సుక్మా–గరియాబంద్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం తీవ్ర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు పది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.
వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మొడెం బాలకృష్ణ కూడా ఉన్నాడని అటవీ ప్రాంతం నుంచి లభిస్తున్న సమాచారం చెబుతోంది. ఆయన తెలంగాణకు చెందినవాడని కూడా తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ను రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ధ్రువీకరించారు. ఇంకా కొన్ని మృతదేహాలు గుర్తింపు దశలో ఉన్నాయని, కాల్పులు పూర్తిగా ఆగలేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nepal Gen Z Protest: తాత్కాలిక ప్రధాని కోసం.. తమలో తామే కొట్టుకుంటున్న జెన్ Z..
అదే సమయంలో, దంతేవాడ జిల్లాలోని పల్లి-బార్సూర్ రోడ్డులో ప్రెజర్ ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిలో ఒకరు ఇన్‌స్పెక్టర్‌గా గుర్తించారు. బాంబ్ డిటెక్షన్ & డిస్పోజబుల్ స్క్వాడ్ టీమ్‌కు చెందిన మరో జవాన్ కూడా గాయపడ్డాడు. గాయపడిన ఇద్దరిని మొదట దంతేవాడ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భద్రతా దళాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. చనిపోయిన మావోయిస్టుల ఖచ్చితమైన గుర్తింపు, వారి హోదాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సంఘటనతో మరోసారి ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు సమస్య తీవ్రత బయటపడింది.

