Mass Jathara: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్ జాతర’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, రవితేజ కెరీర్‌లో 75వ మైలురాయి సినిమాగా నిలుస్తోంది.
‘ధమాకా’ తర్వాత రవితేజ–శ్రీలీల జోడీ మరోసారి తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన లభించగా, సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ నెలకొంది.
ముందుగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను ఈ వారంలో నిర్వహించాలని భావించిన చిత్రబృందం, కొన్ని కారణాల వల్ల దానిని రద్దు చేసింది. అయితే, దాని స్థానంలో అక్టోబర్ 28న హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకకు తమిళ స్టార్ హీరో సూర్య శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సూర్య–రవితేజ ఒకే స్టేజ్‌పై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
ఇది కూడా చదవండి: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో కీలక మార్పు!
ఈ ఈవెంట్‌లోనే ‘మాస్ జాతర’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. సూర్య హాజరు కావడంతో కోలీవుడ్, టాలీవుడ్ అభిమానులు భారీగా ఈ వేడుకకు హాజరవుతారని అంచనా.
‘మాస్ జాతర’ సినిమాను వింటేజ్ మాస్ ట్రీట్‌గా రూపొందించినట్లు చిత్ర బృందం చెబుతోంది. రవితేజ కెరీర్‌లోని క్లాసిక్ మాస్ ఎనర్జీని గుర్తు చేసేలా కథను తెరకెక్కించారని దర్శకుడు భాను భోగవరపు తెలిపారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అనేక వాయిదాల అనంతరం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది ‘మాస్ జాతర’. అదే రోజు రాజమౌళి–ప్రభాస్ బాహుబలి ఎపిక్ స్పెషల్ స్క్రీనింగ్ ఉండటం వల్ల, మేకర్స్ మొదట సాయంత్రం ప్రీమియర్స్ ప్రదర్శించి, నవంబర్ 1 నుంచి రెగ్యులర్ షోలు ప్రారంభించాలని నిర్ణయించారు.

