Dharmasthala Case: ధర్మస్థల కేసు వ్యవహారం మరోసారి సంచలన మలుపు తిరిగింది. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడనే ఆరోపణలపై సిట్ అధికారులు ముసుగు వ్యక్తి భీమాను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కట్టుకథలు చెప్పాడనే అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.
ఇటీవల భీమా తనను మాజీ పారిశుద్ధ్య కార్మికుడిగా పరిచయం చేసుకుంటూ, ధర్మస్థల ప్రాంతంలో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని సంచలన ఆరోపణలు చేశాడు. అందులో ఎక్కువగా అత్యాచారం, హత్యలకు గురైన మహిళల మృతదేహాలే ఉన్నట్లు చెప్పడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారులు తవ్వకాలు ప్రారంభించినప్పటికీ, ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
ఇది కూడా చదవండి: Mass Jathara: వాయిదా పడ్డ మాస్ జాతర.. సెప్టెంబర్ లో కూడా కష్టమే..?
శుక్రవారం రాత్రి నుండి తెల్లవారుజాము వరకు సిట్ చీఫ్ ప్రణబ్ మహంతి భీమాను తీవ్రంగా ప్రశ్నించారు. కానీ అతడు తప్పుడు కథలతో అధికారులను నమ్మించి, చివరికి నిజానికి ఏమీ తెలియదని ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భీమాను అరెస్టు చేసి ఈరోజు (శనివారం) కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే కాకుండా గతంలో కూడా భీమా తన వాంగ్మూలం మార్చి వివిధ కథలు చెప్పినట్లు రికార్డులు చెబుతున్నాయి.
సుజాత భట్ అంగీకారం – “కట్టుకథే అన్నీ”
ఈ కేసులో మరో కీలక మలుపు సుజాత భట్ వాంగ్మూలం. గతంలో ఆమె తన కూతురు అనన్య భట్ ధర్మస్థల నుండి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. 2003లో తన కూతురు స్నేహితులతో ఆలయానికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పడంతో ఈ వ్యవహారం మరింత క్లిష్టమైంది.
అయితే తాజాగా ఆమె యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “అది అంతా కట్టుకథే” అని బహిరంగంగా అంగీకరించారు. అసలు తనకు అనన్య భట్ అనే కూతురే లేదని, ధర్మస్థల వ్యవహారంలో ఉన్న కొందరు ప్రముఖుల ఒత్తిడితో తాను అలా చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు బయటకు వచ్చిన అనన్య ఫొటోలు కూడా సృష్టించినవేనని ఆమె వెల్లడించారు.
సుజాత భట్ తన వాంగ్మూలంలో,
-
“ధర్మస్థల ఆలయ అధికారులు మా కుటుంబ భూమిని అనుమతి లేకుండా లాక్కున్నారు. ఆ ఆస్తి విషయాన్ని పరిష్కరించుకోవడానికి వాళ్లు చెప్పినట్లే చెప్పాను. కానీ ఇప్పుడు అది తప్పు అని అర్థమైంది. అందుకే నిజం చెబుతున్నాను” అని స్పష్టం చేశారు.
కేసులో కొత్త మలుపు
భీమా తప్పుడు ఆరోపణలు, సుజాత భట్ వెనక్కి తీసుకున్న వాంగ్మూలం – ఈ రెండు పరిణామాలు కలిసిపోవడంతో ధర్మస్థల కేసు దర్యాప్తు కొత్త దిశలోకి మళ్లింది. సిట్ అధికారులు ఇప్పుడు ఈ కట్టుకథల వెనుక ఉన్న నిజమైన కుట్రదారులను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు.

