Manu bhakar: ప్రముఖ క్రీడాకారిణి మను భాకర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం హర్యానాలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామ మరణించారు.
వారి ప్రయాణిస్తున్న బ్రెజ్జా కారు ఓ స్కూటీని ఢీకొట్టింది. ఈ దెబ్బతో కారు బోల్తా పడింది. ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడుపుతుండగా, ప్రమాదం తర్వాత అతను కారును వదిలి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
మను భాకర్ ఇటీవలే తన క్రీడా ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గత ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న మను భాకర్‌ను కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది. రెండు రోజుల క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు.
ఈ పరిస్థితుల్లో అమ్మమ్మ, మామలను కోల్పోవడం మను భాకర్ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. దేశం గర్వపడే క్రీడాకారిణి కుటుంబానికి ఈ దుర్ఘటన గుండె చెదిరే దుఃఖాన్ని మిగిల్చింది.