Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కూడా పాల్గొన్నారు.
దేవాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మరియు కేంద్ర మంత్రులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. వేద పండితులు ‘పూర్ణ కుంభం’తో ఎదురేగి, వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం వీరంతా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దైవ దర్శనం ముగించుకున్న తర్వాత సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి సిరిపురంలోని వీఎంఆర్డీఏ (VMRDA) కార్యాలయానికి వెళ్లారు. అక్కడ విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించిన పనులను వారు స్వయంగా పరిశీలించారు. రైల్వే జోన్ కార్యాలయ ఏర్పాటు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వే జోన్ పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
