Viral News

Viral News: బ్యాంకు రూల్స్ vs మానవత్వం.. సమాధి నుంచి సోదరి శవాన్ని తీసి బ్యాంకుకు తీసుకొచ్చిన తమ్ముడు!

Viral News: నియమ నిబంధనల పేరుతో బ్యాంకులు సామాన్యులను ఎంతలా ఇబ్బంది పెడతాయో చెప్పడానికి ఒడిశాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. చనిపోయిన తన అక్క అకౌంట్లో ఉన్న సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి, ఒక గిరిజన వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని ఏకంగా బ్యాంకుకే తీసుకువచ్చాడు. “అకౌంట్ హోల్డర్ వస్తేనే డబ్బులిస్తాం” అని బ్యాంక్ సిబ్బంది మొండిగా చెప్పడంతో, చేసేదేమీ లేక ఆ నిరక్షరాస్యుడైన వ్యక్తి ఈ సాహసం చేశాడు. కియోంఝర్ జిల్లాలోని మాలిపోసి గ్రామీణ బ్యాంక్ శాఖలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

డయానాలి గ్రామానికి చెందిన జీతూ ముండా (50) అనే వ్యక్తి సోదరి కల్రా ముండా ఈ ఏడాది జనవరిలో మరణించింది. ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 20,000 తీసుకోవడానికి జీతూ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే, నామినీ కూడా చనిపోవడంతో ఆ డబ్బు తీసుకోవడం అతనికి కష్టమైంది. తాను ఒక్కడినే వారసుడినని, తన అక్క చనిపోయిందని మొరపెట్టుకున్నా బ్యాంక్ అధికారులు కనికరించలేదు. “అకౌంట్ ఎవరిదో వాళ్లను ఇక్కడికి తీసుకురావాల్సిందే” అని నిబంధనలు వల్లెవేశారు. ఆమె చనిపోయిందని చెప్పినా వారు వినకపోవడంతో జీతూ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

బ్యాంకు అధికారుల తీరుతో విసిగిపోయిన జీతూ, తన అక్క చనిపోయిందని నిరూపించడానికి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని బయటకు తీశాడు. ఆ ఎముకల గూడును ఒక సంచిలో మూటగట్టుకుని, భుజాన వేసుకుని నేరుగా బ్యాంకుకు నడుచుకుంటూ వెళ్లాడు. దారిలో వెళ్తున్న జనం ఈ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. గిరిజనుడైన జీతూకు చట్టపరమైన వారసత్వ ధృవీకరణ పత్రాల గురించి తెలియకపోవడం, అతనికి సరైన దారి చూపడంలో బ్యాంక్ సిబ్బంది విఫలం కావడమే ఈ వింత పరిస్థితికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక అధికారులు స్పందించారు. జీతూ ముండాకు ఆ డబ్బుపై పూర్తి హక్కు ఉందని, వెంటనే అతనికి ఆ నగదు అందేలా చూడాలని బ్యాంకును ఆదేశించారు. నిబంధనల పేరుతో సామాన్యులను, ముఖ్యంగా చదువుకోని గిరిజనులను ఇలా వేధించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం మర్చిపోయి వ్యవహరించే వ్యవస్థలకు ఈ ఘటన ఒక చెంపదెబ్బ వంటిదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *