Chandrababu: కొందపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో దేశంలో శాంతిభద్రతలు మెరుగుపడుతున్నాయన్నారు. అమిత్ షా అన్ని విషయాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం విషయంలోనూ కేంద్రం కొత్త ఆలోచనలతో సహకరించాలని అభిప్రాయపడ్డారు.
గత ఎన్నికల్లో టీడీపీ కూటమి 93 శాతం స్ఫలితాలతో ఘనవిజయం సాధించిందని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం రూ. 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉందని, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ స్థితిలో ఉన్నదని చెప్పారు. కేంద్రం ఆర్థిక సహకారం వల్ల రాష్ట్రం ఆ పరిస్థితి నుంచి బయటపడినప్పటికీ, ఇంకా పేషెంట్‌లా ఉందని వ్యాఖ్యానించారు.
అమరావతి నిర్మాణం కోసం కేంద్రం రూ. 15 వేల కోట్లు మంజూరు చేసిందని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులు కూడా కేంద్ర మార్గదర్శకత్వంలో జరుగుతున్నాయని, 2027 ఏప్రిల్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ. 11,440 కోట్ల ప్యాకేజీ అందించడంతో పరిశ్రమకు కొత్త ఊపొచ్చిందని చంద్రబాబు అన్నారు. విశాఖ రైల్వే జోన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మరింత మద్దతు అవసరమని తెలిపారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు.
విజన్-2047 పై ధీమా
భారతదేశం 2047 కల్లా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలని కేంద్రం దృష్టిలో ఉంచుకున్న లక్ష్యానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ లక్ష్యానికి భాగస్వామిగా వ్యవహరిస్తుందని, రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.