Amit shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇవాళ కృష్ణా జిల్లా కొండపావులూరులో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐడీఎం) ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. సభలో ప్రసంగించిన అమిత్ షా, తెలుగులో మాట్లాడలేకపోవడం పట్ల క్షమాపణలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ విధ్వంసం పై విమర్శలు
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో సమస్యలు ఎదుర్కొందని, అది మానవ విపత్తుకు సమానమని అమిత్ షా అన్నారు. ఆ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ఎన్డీయే కూటమి పనిచేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అంతకు మూడింతల అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అమరావతి, పోలవరంపై ప్రకటనలు
అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా రూ. 27 వేల కోట్ల సాయం అందించామని అమిత్ షా తెలిపారు. అమరావతి రాజధాని అభివృద్ధికి తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ముఖ్యమైందని, 2028 నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో నీటి సమస్యలు తీర్చబడతాయని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు
ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు రూ. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించామని చెప్పారు. విశాఖలో రూ. 2 లక్షల కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌ను కూడా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు.
ఏపీకి కేంద్రం అండ
గడచిన ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3 లక్షల కోట్ల సహాయం అందించామని అమిత్ షా వివరించారు. రాష్ట్రం అభివృద్ధికి ప్రధానమంత్రి మోదీ సంపూర్ణ సహకారంతో ఉన్నారని, ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతిపథంలోకి నడిపిస్తాయని అన్నారు.