Kishan Reddy

Kishan Reddy: రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఒక బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని కీలకమైన రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఈ లేఖలో ఆయన కోరారు. ముఖ్యంగా చర్లపల్లి మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులపై కిషన్ రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు.

చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి ప్రస్తావిస్తూ.. అక్కడ రోడ్లు చాలా ఇరుకుగా ఉండటం వల్ల ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. స్టేషన్ అందుబాటులోకి వస్తే రద్దీ మరింత పెరుగుతుందని, అందుకే వెంటనే అక్కడి రోడ్లను విస్తరించాలని కోరారు. అంతేకాకుండా, వాహనాల పార్కింగ్ కోసం రైల్వే స్టేషన్ సమీపంలో అదనంగా మరో 5 ఎకరాల భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కూడా లేఖలో వివరించారు. అక్కడ కూడా రోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కోరారు. ఈ పనులన్నీ పూర్తయితేనే ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుతాయని, కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ అంశాలపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి తన లేఖలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *