Manchu Manoj: తాజాగా మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. హీరో మంచు మనోజ్ తిరుపతి జిల్లా భాక్రపేటలో ఉన్న ప్రైవేట్ రిసార్ట్స్‌లో బసచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్థానికంగా ఉన్న ఘాట్ రోడ్, ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు సోమవారం అర్ధరాత్రి గస్తీ నిర్వహించగా, అక్కడ ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని గమనించారు. దీంతో వారు ఎవరు, అక్కడ ఎందుకు ఉన్నారనే విషయాన్ని పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ బౌన్సర్లు వెంటనే మంచు మనోజ్‌కు ఈ సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మంచు మనోజ్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ‘నన్ను అరెస్టు చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు.. నన్ను అరెస్టు చేయండి..’ అంటూ పోలీసులతో అన్నారు. దీనికి భాక్రపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్పందిస్తూ, ‘మేము అరెస్టు చేయడానికి రాలేదు.. రాత్రి సమయంలో హైవేపై, ఘాట్ రోడ్ పరిసరాల్లో బౌన్సర్లు ఉండటంతో వారికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం మాత్రమే వచ్చాం’ అని వివరించారు.
ఈ ఘటన తర్వాత మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ ఎదుట మెట్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తాను రిసార్ట్స్‌లో ఉండటం ఎందుకు సమస్యగా మారిందో, తనపై విచారణ ఎందుకు జరుగుతోందో పోలీసులను నిలదీశారు. ఈ సంఘటనపై ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ నుండి అధికారిక స్పందన రాలేదు. అయితే, ఈ ఉదంతం మంచు ఫ్యామిలీ వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Manchu Manoj In Police Station: నన్ను అరెస్టు చేయండి.. మంచు మనోజ్