Minors’ Drug Party: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీల వ్యవహారం పెరుగుతున్న నేపథ్యంలో, రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఒక సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పెద్ద మంగళారం గ్రామంలో ఉన్న చెర్రీ ఓక్స్ ఫామ్‌హౌస్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, మైనర్లు నిర్వహిస్తున్న మద్యం, డ్రగ్స్ పార్టీని అడ్డుకున్నారు.
50 మంది మైనర్లు అరెస్టు, ఇద్దరికి గంజాయి పాజిటివ్
నిర్దిష్ట సమాచారం మేరకు రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు, ఫామ్‌హౌస్‌లో అక్రమంగా పార్టీ చేసుకుంటున్న సుమారు 50 మంది మైనర్లను (ఇంటర్ విద్యార్థులను) పట్టుకున్నారు. వీరిలో 12 మంది యువతులు, 38 మంది యువకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టుబడిన యువతకు డ్రగ్ టెస్టులు చేయగా, ఇద్దరు మైనర్లకు గంజాయి పాజిటివ్‌గా తేలింది. అదనంగా, పోలీసులు అక్కడి నుండి 8 విదేశీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మొయినాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Danam Nagender: నేను రాజీనామా చేయడం లేదు.. ప్రచారాన్ని ఖండించిన దానం నాగేందర్
ఈ పార్టీని ఏర్పాటు చేసిన ఫామ్‌హౌస్ యజమాని త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ట్రాప్‌హౌస్ 9ఎంఎం’ పేరుతో నకిలీ ఖాతాను సృష్టించి, యువతను పార్టీ పేరుతో ఆకర్షించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.1,300 ఎంట్రీ ఫీజు తీసుకుని, మైనర్లకు మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అందుబాటులో ఉంచాడు.
పోలీసులు మెరుపుదాడులు చేయడంతో ఈ అక్రమ దందాకు తెరపడింది. ఫామ్‌హౌస్ యజమానితో పాటు ఆరుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు కోసం యువతను తప్పుదారి పట్టిస్తున్న ఇలాంటి ఘటనలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ శివార్లలో ఇలాంటి రహస్య డ్రగ్స్ పార్టీలు తరచుగా జరుగుతున్నాయని, దీనిపై తమ నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.