Maharashtra elections: ఎన్నికల హడావుడితో మహారాష్ట్ర అట్టుడుకుతోంది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అటు అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటెత్తారు. గత ఎన్నికల్లో 3,239 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 5,543 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగా, ఈసారి ఆ రికార్డు బద్దలైంది. 288 స్థానాలకు గాను దాదాపు 8 వేల మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
వచ్చే నెల 20న పోలింగ్ జరగనుండగా మొత్తం 7,995 మంది అభ్యర్థులు 10,905 నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. నాసిక్ జిల్లాలో అత్యధికంగా 361 మంది అభ్యర్థులు 506 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 255 మంది నిన్న పేపర్లు సమర్పించారు.వీరిలో కేబినెట్ మంత్రులు దాదా భూసే (శివసేన) మాలేగావ్ అవుట్ నుంచి, చగన్ భుజ్‌బల్ (ఎన్సీపీ) యేవల్ నుంచి, సుహాస్ కండే (శివసేన) నందగావ్ నుంచి, రాహుల్ ధిక్లే (బీజేపీ) నాసిక్ ఈస్ట్ నుంచి, మాజీ ఎమ్మెల్యే వంత్ గీతే (శివసేన-యూబీటీ) నాసిక్ సెంట్రల్ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే సరోజ్ అహిరే ( ఎన్సీపీ) దేవ్‌లాలి నుంచి పోటీపడుతున్నారు.
ఈ నెల 22న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా 29న ముగిసింది. నవంబర్ 4న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాతే బరిలో ఎంతమంది నిలిచారన్న దానిపై స్పష్టత వస్తుంది.