Telangana: తెలంగాణలో డ్రగ్స్ రాజకీయం రసవత్తరంగా నడుస్తున్నది. ఇటీవల కేటీఆర్ బావమరిది ఇంటిపై ఎక్సైజ్ పోలీసుల దాడుల నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఏకంగా డ్రగ్ టెస్టులు చేయించుకుందాం రండి.. అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య వార్ నడుస్తున్నది.
Telangana: బీఆర్ఎస్ ముఖ్య నేతలకు, ప్రజాప్రతినిధులకు డ్రగ్ టెస్టు చేయించాలంటూ రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్‌గా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఎంపీ అనిల్‌కుమార్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అందరం డ్రగ్ టెస్టుకు వస్తాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రావాలి.. వరల్డ్ టాప్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వద్ద టెస్టు చేయించుకుందాం.. దీంతో ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో తేలిపోవాలని కౌశిక్‌రెడ్డి ప్రతి సవాల్ విసిరారు.
Telangana: మీడియా ముందే తేల్చుకుందాం.. రాత్రి ఎనిమిది గంటలకు రండి అంటూ కౌశిక్‌రెడ్డి మంగళవారం కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. దీంతో స్పందించిన ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ వెంకట్ కలిసి రాత్రి హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి చేరి ఎదురు చూశారు. బీఆర్ఎస్ నేతలు రాకపోవడంతో వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు. అయితే దీనికి ప్రతిగా తమకు చెప్పకుండా కాంగ్రెస్ నేతలు ఆస్పత్రికి వెళ్లడమేంటి అంటూ కౌశిక్‌రెడ్డి ప్రతిస్పందించారు.
Telangana: దొంగచాటుగా వెళ్లడమేంటి? డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకొని టైం చెప్తే మేమూ వస్తామని చెప్పాం కదా.. మేమంతా వస్తాం.. అలాగే కాంగ్రెస్ నేతలూ రావాలి, అందరికీ డ్రగ్ టెస్ట్ చేయించాలని కౌశిక్‌రెడ్డి స్పందించారు. అయితే బుధవారం ఉదయం మళ్లీ హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇద్దరూ కలిసి వెళ్లారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలైన కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్ టెస్టుకు రావాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సవాళ్లు, ప్రతిసవాళ్ల నడుమ తెలంగాణలో డ్రగ్ రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. ఇది ఏ దశకు మారుతుందో వేచి చూడాలి మరి.