Mahabubabad:మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకున్నది. తోటి విద్యార్థుల సమక్షంలో ఆనందంతో నృత్యం చేస్తూ ఓ విద్యార్థిని ఒక్కసారిగా వేదికపైనే కుప్పకూలింది. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అంతా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటినా ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. తోటి విద్యార్థులంతా ఆందోళనకు గురయ్యారు.
Mahabubabad:మహబూబాబాద్ మండలం సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలలో నిన్న రాత్రి పదో తరగతి విద్యార్థులకు ఫేర్‌వెల్ పార్టీలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు అక్కడ డీజే సౌండ్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మరిపెడ మండలం తానంచర్ల శివారు సపావట్ తండాకు చెందిన ఇంటర్మీడియట్ సీఈసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16) డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా వేదికపైనే కుప్పకూలి పడిపోయింది.
Mahabubabad:వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యార్థిని రోజాను మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈలోగా కుటుంబ సభ్యులు వచ్చారు. రోజాను పరిశీలించిన అక్కడి వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించారు. దీంతో తోటి విద్యార్థులు, కుటుంబసభ్యుల రోదనలు ఆ ఆసుపత్రి ఆవరణలో మిన్నంటాయి. అందరితో ఆనందం పంచుకున్న ఆమె మరణాన్ని తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు.