Nara Lokesh

Nara Lokesh: మండలిలో లోకేష్‌ ఐడియా..షాక్‌లో వైసీపీ!

Nara Lokesh: మండలిలో లోకేష్‌ ధాటికి చెల్లా చెదురవుతోంది వైసీపీ. కూటమి కంటే సంఖ్యా బలం ఎక్కువున్నా, బొత్స నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నా.. లోకేష్‌ నుండి వచ్చే తూటాల్లాంటి సమాధానాలతో మండలిలో వైసీపీ వ్యూహాలు పటాపంచలు అవుతున్నాయా? అటు శాసన సభలోనూ సేమ్‌ సీన్‌ కనబడుతోందా? ఉభయ సభలలో వైసీపీ వ్యవహార శైలికి, దాన్ని కౌంటర్‌ చేస్తూ లోకేష్‌ విసురుతున్న పంచులకు… చప్పగా సాగుతాయనుకున్న సమావేశాలు కాస్తా హాట్‌ టాపిక్‌లుగా మారుతున్నాయా? హ్యావ్‌ ఎ లుక్‌.

ప్రస్తతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గతంలో ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నారు ఏపీ ప్రజలు. ప్రతిపక్ష నేత హోదా పేరుతో వైసీపీ అధినేత ఒక్క రోజు, అది కూడా 11 నిమిషాలు షో చేసి వెళ్లిపోయారు. ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి రాకుండానే మంత్రులకు ప్రశ్నలు పంపిస్తున్నారు. ప్రశ్నలడిగిన సభ్యులు సభలో లేరు కాబట్టి.. మౌఖికంగా సమాధానం చెప్పాల్సిన పనిలేకుండా పోయింది కూటమి మంత్రులకు. రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్నే వైకాపా ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వక్రీకరణలు జోడించి సోషల్‌మీడియాలో హడావుడి కోసం వాడుకుంటున్నారు.

ఇక మండలిలో వైసీపీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని అపించిన ప్రతిసారీ.. వెంటనే నిరశపరుస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. మండలిలో వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న బొత్స ఇటీవల రాజధానిపై వైసీపీ స్టాండ్‌ ఏంటో చెప్పలేక మండలిలో నీళ్లు నమిలి, సభ సాక్షిగా వైసీపీకి అభాసుపాలు చేశారు. ఇక ఏదో ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేద్దామనుకుని, మంత్రి నారా లోకేష్‌ చేతిలో చిత్తవుతున్నారు మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు. ప్రశ్న అడగడంతోనే తమ పని అయిపోయిందన్నట్లుగా.. సమాధానాలు వినకుండా వాకౌట్‌ చేసి వెళ్లిపోతున్న వైసీపీ సభ్యుల తీరుపై… తాజాగా మంత్రి లోకేష్‌ విసిరిన పంచ్‌.. ఒక రకంగా సెటైరే అయినా.. ఆలోచిస్తే నిజమే కదా అని అనిపించక మానదు.

ఇది కూడా చదవండి: YSR Kadapa District: చరిత్రనే చెరిపేయాలని చూసిన వైసీపీ..!

సాధారణంగా శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా పార్టీకి చెందిన సభ్యులు హద్దుమీరి ప్రవర్తిస్తే మార్షల్స్ రంగ ప్రవేశం చేస్తారు. సభలో గందరగోళం సృష్టించి సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న సభ్యులను సభ నుంచి బయటకు పంపిస్తారు. ఇంకా మాట వినని సభ్యులెవరైనా ఉంటే వారిని మార్షల్స్ బలవంతంగా ఎత్తుకు తీసుకువెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే, మంత్రి నారా లోకేశ్ మాత్రం మార్షల్స్ ను మరోలా ఉపయోగించుకోవచ్చంటూ శాసన మండలి ఛైర్మన్ మోషెస్ రాజుకు సరికొత్త ఐడియా ఇచ్చారు. పదేపదే సభ నుంచి పారిపోతున్న వైసీపీ సభ్యులను సభ లోపలికి తెచ్చేందుకు మార్షల్స్ సాయం తీసుకోవాలని లోకేశ్ చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.

2019-24 వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చను నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ అంశంపై చర్చకు అనుమతిస్తూ మండలి ఛైర్మన్ ఆదేశాలు జారీ చేశారని, బీఏసీలో వైసీపీ సభ్యులు అంగీకరించారని లోకేశ్ గుర్తు చేశారు. ఆ అంశంపై సమాధానం ఇస్తుండగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారని లోకేశ్ ఫైర్ అయ్యారు.

వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతారని, సమాధానానికి సమయం ఇవ్వరని, సమాధానం ఇచ్చే సమయంలో సభలో ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి లోకేష్‌. పదేపదే ఈ విధంగా చేస్తున్నారని, ఇది సరికాదని… గతంలో మార్షల్స్‌ను పెట్టి సభను నడిపించిన పరిస్థితి ఉందని, ఇప్పుడు మార్షల్స్‌ను పెట్టి బయట ఉన్న వైసీపీ సభ్యులను సభకు తీసుకు వచ్చే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఆ అధికారం ఛైర్మన్‌కు ఉందని గుర్తు చేశారు. మార్షల్స్ ను పెట్టి బయటకు వెళ్లిన వైసీపీ సభ్యులను లోపలికి తీసుకురావాలని ఛైర్మన్‌ను లోకేశ్ కోరిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *