YS Jagan: జగన్‌కి ఇప్పుడు అర్జంటుగా కావాల్సింది క్రేజ్. దాన్ని క్రియేట్ చేసుకునే పనిలోనే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాను రోడ్డుపై కాలుపెడితే చాలు.. ఇసుకేస్తే రాలనంతమంది వస్తారన్నది ఆయన కష్టపడి ప్రజల్లో క్రియేట్ చేసిన ఓ ఒపీనియన్. ఆ విషయంలో దేనికైనా సరే వెనుకాడరు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. వందల కోట్లు ఖర్చు పెట్టి గత ఎన్నికల్లో సిద్ధం సభలు పెట్టినా, బస్సు యాత్రలు చేసినా.. కనుచూపు మేరా జనమే అన్నట్లు కృత్రిమ సీన్లు క్రియేట్ చేసినా, అందుకు గ్రీన్ మ్యాట్లు, గ్రాఫిక్స్ వాడుకున్నా, జీతాలిచ్చి పోషిస్తున్న సోషల్‌మీడియా టీమ్‌లతో ఎలివేషన్లు జోడించుకుని ప్రచారం చేయించుకున్నా.. వాస్తవానికి జనం రాలేదు. ఓట్లు రాలేదు.
అందుకే అతి కష్టం మీద డబుల్ డిజిట్ స్కోర్ సాధించగలిగారు. జగన్‌కి జనంలో క్రేజ్ అన్నది అభూత కల్పనే అని గత ఎన్నికలతో స్పష్టమైంది. గత ఎన్నికల్లోనూ, ఎన్నికల తర్వాత కూడానూ… ఆయన ప్రసంగాల స్క్రిప్ట్‌ల్లో పస కూడా బాగా తగ్గిపోయింది. జనంలో కోల్పోయిన తన గత వైభవాన్ని జగన్ మళ్లీ సృష్టించుకునే పనిలో పడ్డారని ఇటీవలి పరిణామాలు చూస్తుంటే స్పష్టమౌతోంది.
జగన్ లండన్ పర్యటన తర్వాత అనేక సార్లు అనేక జిల్లాల్లో పర్యటనలు చేశారు. జైలు యాత్రలు చేపట్టి హల్‌చల్ చేశారు. కానీ ఎక్కడా జగన్ వచ్చాడని జనం ఎగబడ్డ సందర్భాలు లేవు. కానీ అనూహ్యంగా ఇటీవల చేపట్టిన ఓ రెండు పర్యటనల్లో జనం పోటెత్తారు. జగన్‌ని చూసేందుకు ఆరాటపడ్డారు. ఆయనతో ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు. రోడ్డుపై ఆయన క్వాన్వాయ్ వెళ్తుంటే వెంటపడ్డారు. నిజానికి ఆ రెండు పర్యటనలకు కారణం.. ఒకటి పెళ్లి, ఇంకొకటి చావు. దీన్ని బట్టి తన క్రేజ్‌ని రీక్రియేట్ చేసుకునేందుకు ఆయన పెళ్లిళ్లు, చావులను ఎంచుకున్నట్లు కనబడుతోంది.
YS Jagan: మొన్న మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ సభో, ప్లీనరీనో పెడితే లక్షల్లో కాక పోయినా వేలల్లో అయినా తరలివచ్చేందుకు కసి మీద ఉన్నారు వైసీపీ శ్రేణులు. కానీ బోలెడంత ఖర్చైపోతుందని అలాంటి ఈవెంట్లేమీ పెట్టలేదు. అదే పెళ్లిళ్లు, చావులకు వెళ్తే… అక్కడి స్థానిక నేతలే క్యాడర్‌ని, జనాల్ని గ్యాదర్ చేస్తారు. హెలీకాప్టర్ ఖర్చు ఒక్కటి భరిస్తే చాలు.. కావాల్సినంత ఎలివేషన్ వస్తుంది. ప్రస్తుతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లున్నారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. దీన్ని వెంటనే అందుకున్న జగన్ సోషల్ మీడియా బ్యాచ్‌లు… మీకు జనం రావాలంటే ప్లీనరీలు, ఆవిర్భావ సభలు కావాలేమో… మా అన్నకు పెళ్లిళ్లు, చావులు చాలంటూ డప్పు కొడుతున్నారు.
ఇక ఇటీవల జగన్ రెండు పర్యటనల్లో జనం కనబడ్డ, ఎగబడ్డ దృశ్యాలు నిజంగా నిజమేనా? లేక గ్రాఫిక్సా? అన్న సందేహం కలుగుతోందా ఎవరికైనా? సందేహమే లేదు.. జనం వచ్చిన మాట వాస్తవమే కానీ.. అది వైసీపీ సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకుంటున్నంత రేంజ్‌లో మాత్రం కాదని చెప్తున్నారు పరిశీలకులు. ఆ రెండు పర్యటన వివరాలు ఒకసారి ఆరా తీస్తే.. ఒకటి తెనాలిలో జరిగిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్. మొన్నటిదాకా అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కుమారుడి వివాహం అంటే… ఎంత లేదన్నా ఐదారువేల మందికి ఆహ్వానాలు వెళ్తాయి. అనుచరులు, పార్టీ క్యాడరు అదనం. ఇక వివాహ రిసెప్షన్‌కి చేసిన భారీ ఏర్పాట్లు చూస్తే.. జన సమీకరణకు ముందుగానే ప్లాన్ చేశారని ఈజీగానే అర్థమౌతుంది. ఇక తెనాలికి జగన్ వస్తున్నారని ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేశారన్నది బహిరంగ రహస్యమే అంటున్నారు తెనాలిలో స్థానికులు.
Also Read: Pawan Kalyan: చిరుకి ‘జీవిత సాఫల్య పురస్కారం’.. పవన్ ఎమోషనల్ పోస్ట్!
YS Jagan: ఇక రెండోది బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల పర్యటన. వైసీపీ ఎంపీ, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ కాలం చేయడంతో.. పార్థివ దేహానికి నివాళులర్పించి, వైవీ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే పేరిట అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్ల వెళ్లారు జగన్మోహన్‌రెడ్డి. అక్కడా జనం ఎగబడ్డారు. ఇదేం విడ్డూరమని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైవీ సుబ్బారెడ్డి స్థానికంగా పట్టున్న వైసీపీ నేత. మాజీ టీటీడీ చైర్మన్. ప్రస్తుతం ఎంపీ కూడా. అటువంటి వ్యక్తి ఇంట విషాదం అంటే సాధారణంగానే అనుచరులు, కార్యకర్తలు తరలిరావడం సహజం.
కానీ విడ్డూరం ఏంటంటే… మంగళవారం మేదరమెట్లకు జగన్ వస్తున్నారనీ, కావున నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని సోషల్‌మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేశారు స్థానిక వైసీపీ నేతలు. ముందుగా మేదరమెట్ల హెలీప్యాడ్ వద్దకు చేరుకుని జగనన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. చావింట పరామర్శకు వస్తుంటే ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునివ్వడం వైసీపీకే చెల్లిందంటున్నారు అద్ధంకి నియోజకవర్గ ప్రజలు.
YS Jagan: ఇక మీదట కూడా జగన్ పర్యటనల్లో ఇలాంటి దృశ్యాలు పునరావృతం అవుతాయని ఈజీగానే ఊహించొచ్చు. ఎందుకంటే తనకి జనంలో క్రేజ్ తగ్గలేదని నిరూపించుకునేందుకు… కాదు కాదు.. నమ్మించేందుకు జగన్ బలంగా పూనుకున్నట్లు అర్థమవుతోంది. ఇక మీదట పెళ్లికి వెళ్లినా, చావుకి వెళ్లినా.. బలంగా జన సమీకరణ చేయాలని పార్టీ నేతల్ని ఆదేశించాకే వెళ్తారనడంలో ఆశ్చర్యం లేదు. ఇక 500 మంది వచ్చినా.. 50 వేల మంది వచ్చారన్నంతగా హైప్ ఇస్తూ, ఎలివేషన్లు జోడించడంలో ఆరితేరిన సోషల్‌మీడియా టీమ్‌లు ఆ పార్టీకి ఎలాగో ఉండనే ఉన్నాయ్. కాబట్టి ఇక రాబోయే నాలుగేళ్లు జగనన్న పర్యటనలు జన జాతరలే అన్నమాట.