Peeleru Land Mafia: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కూమార్ రెడ్డి సియం అయిన తర్వాత పీలేరు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ది పనులు జరిగాయి. ఇదే సమయంలో నియోజకవర్గంలో జాతీయ రహాదారుల విస్తరణ పనులు చేపట్టారు. ఈ సమయంలో అనేక ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులుగా ఉన్న సమయంలో కొంత భూమిని కబ్జా చేసారు. అయితే వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి అక్రమార్కులు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. అయితే ఆ దఫా టీడీపీ అధికారంలోకి రావడంతో కొంత సైలెంట్ అయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక అడ్డూ అదుపు లేకుండా విజృభించారు.
కొండలు గుట్టలు సహా ఏకంగా వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఏడాదిలో ఆక్రమించారు. అనధికార వెంచర్లు వేసి అమ్మేశారు. ఆ స్థలాలు కొన్నవారు గృహనిర్మాణాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ విషయాలపై అప్పట్లో లోకాయుక్తకు టిడిపి జాతీయ కార్యదర్శి, ప్రస్తుత పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కూమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అప్పటి మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి విచారణ చేపట్టి, భూ అక్రమాలు నిజమేనని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అంతే వెంటనే ఆమె బదిలీ అయిపోయారు. అయితే కిషోర్ కూమార్ రెడ్డి అయితే తన పోరాటాన్ని ఆపలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విచారణ కోసం ఫిర్యాదు చేసారు. సీయంవో ఆదేశాలతో గత 10 రోజులుగా పీలేరు నియోజకవర్గంలో ఆక్రమిత భూమలుపై విచారణ జరగుతోంది.
Peeleru Land Mafia: 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పీలేరు మండలంలోని పీలేరు, దొడ్డిపల్లె, ఎర్రగుంటపల్లె, ముడుపులవేములు, గూడరేవుపల్లె, బోడుమల్లువారిపల్లె గ్రామ పంచాయతీల్లో పెద్దఎత్తున ప్రభుత్వ, డీకేటీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. రియల్టర్ల అవతారమెత్తిన అనేక మంది వైసీపీ నాయకులు సుమారు 600 ఎకరాలను ఆక్రమించి.. వాటిలో ప్లాట్లు వేసి.. అమ్ముకుని రూ.400 కోట్లు దోచుకున్నారు. అప్పట్లో టీడీపీ జాతీయ కార్యదర్శి హోదాలో నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి కూడా ఈ అక్రమాలపై పూర్తి సాంకేతిక ఆధారాలతో జిల్లా ఉన్నతాధికారులకు, హైకోర్టు, లోకాయుక్తలకు ఫిర్యా దు చేశారు. లోకాయుక్త విచారణకు ఆదేశించింది.
సదరు గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 400 కోట్లు విలువజేసే 600 ఎకరాల భూమిలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు విచారణలో తేలింది. పీలేరులో 100.74 ఎకరాలు, గూడరేవుపల్లెలో 165.60 ఎకరాలు, దొడ్డిపల్లెలో 203.92 ఎకరాలు, బోడుమల్లు వారి పల్లెలో 102.99 ఎకరాలు, ఎర్రగుంటపల్లెలో 1.21 ఎకరాలు, ముడుపులవేముల పంచాయతీలో 26.91 ఎకరాలు.. మొత్తం 601.37 ఎకరాల్లో అవకతవకలు జరిగినట్లు సబ్‌కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. వాటిలో 209.79 ఎకరాల పట్టా భూముల్లో, 158.19 ఎకరాల చుక్కల భూముల్లో, 129.40 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనధికార లేఔట్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారని.. 103.99 ఎకరాల డీకేటీ భూములు అక్రమంగా చేతులు మారాయని స్పష్టం చేశారు.
2021 నవంబరులో ఇచ్చిన ఈ నివేదికలో.. ఎకరా రూ.40 లక్షల నుంచి రూ.కోటి దాకా పలుకుతోందని, సగటున ఎకరా రూ.70 లక్షలు వేసుకున్నా అన్యాక్రాంతమైన 129.40 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ రూ.90.58 కోట్లు ఉంటుందని తెలిపారు. సబ్‌కలెక్టర్ నివేదిక ఆధారంగా 2022లో రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ పీలేరు మండలంలో పనిచేసిన 12 మంది రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నారు. వారందరినీ సస్పెండ్ చేయడమే కాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే అప్పటి అధికార పార్టీ నేతల అండదండలతో వారందరినీ బదిలీలతో సరిపెట్టారు.
Also Read: Congress: సిర్పూర్‌లో రచ్చకెక్కిన హస్తం నేతలు!
Peeleru Land Mafia: తాజా విచారణలో పీలేరు మండలంలో అక్రమాలు, ఆక్రమణలపై పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం వీటిపై విచారణ జరపాలని కలెక్టర్ శ్రీధర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన గత నెల 13న ఆక్రమణలను స్వయంగా దగ్గరుండి కూల్చివేయించారు. ఆ సమయంలో అధికారులపై కొందరు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్… గతంలో జరిగిన అక్రమాల పని పట్టాలనుకున్నారు. గత సబ్‌కలెక్టర్ ఇచ్చిన నివేదికను బయటకు తీశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 84 మంది సిబ్బందితో కూడిన 6 బృందాలు 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ, డీకేటీ భూములను పరిశీలించారు.
అక్రమాల నిగ్గుతేల్చి కలెక్టర్‌కు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఆయన మరిన్ని వివరాలతో తుదిమెరుగులు దిద్ది ఈ నెలాఖరులో జరిగే కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పూర్తిస్థాయి నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్క పీలేరుతో పాటు కలికిరి, కలగడ, వాయల్పాడు మండలాల పరిధిలో కలసి ఏకంగా 2500 ఏకరాలకు పైగా ఈవిధంగా అన్యాక్రాంతం అయినట్లు అధికారులు ప్రాథమికంగా నిగ్గు తేల్చారు.
ఈ స్కామ్‌లో వైసీపీ హయాంలో చక్రం తిప్పిన నేతలతో పాటు కూటమిలోని కొంతమంది నేతల పాత్ర కూడా ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే సమీప బంధువు పాత్ర కీలకంగా ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. మొత్తం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి… ల్యాండ్ గ్రాబింగ్ కేసులతో పాటూ ఆర్‌ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, సిఐడికి కేసులను అప్పగించడానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.