Mahaa Conclave

Mahaa Conclave: ‘కూటమి’ పాలనలో కొత్త ఊపు.. అంతర్జాతీయ గుర్తింపు

Mahaa Conclave: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పారిశ్రామిక ఎదుగుదలకు దిశానిర్దేశం చేస్తూ మహా గ్రూప్ సంస్థల సీఎండీ మారెళ్ల వంశీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైజింగ్ ఏపీ’ మహా కాంక్లేవ్‌ రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త ఆశలను చిగురింపజేసింది. విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) నేపథ్యంలో ఈ వేదికపై పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ ప్రముఖులు కీలక చర్చలు జరిపారు.

ఈ కాంక్లేవ్‌లో రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, కూటమి ప్రభుత్వం (NDA Alliance) ఆశయాలపై విస్తృత చర్చ జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సి.ఎం. రమేష్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు వంటి ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేశారు.

పెట్టుబడులు, నమ్మకం: ‘కూటమి’ పాలనలో కొత్త ఊపు

ఎంపీ సి.ఎం. రమేష్ మాట్లాడుతూ… గత వైఎస్సార్సీపీ హయాంలో ఏపీలో వ్యాపారం చేయాలంటే పారిశ్రామికవేత్తలు భయపడేవారని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భయాన్ని తొలగించడానికి ఏడాది పట్టిందని స్పష్టం చేశారు. “ప్రస్తుతం దేశంలో టాప్ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి. కేంద్రం సహకారంతో అపోహలను తొలగించాము. పారిశ్రామికవేత్తల్లో ఈ ప్రభుత్వం నమ్మకాన్ని తీసుకొచ్చింది. ఏపీలో పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోతామనే స్థితిని కూటమి సర్కార్ తీసుకొచ్చింది,” అని అన్నారు.

అనకాపల్లి నియోజకవర్గానికి ఇప్పటికే రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ నినాదం గొప్పదంటూ, సీఎం చంద్రబాబు విజనరీ లీడర్‌షిప్‌ను కొనియాడారు.

కనెక్టివిటీ, ప్రత్యేక విధానాలు: అభివృద్ధికి బాటలు

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… ఏపీ ముఖచిత్రాన్ని మార్చడానికి సీఐఐ భాగస్వామ్య సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. తీర ప్రాంతంలో పోర్టులు ఉండటం, కనెక్టివిటీ పెరగడం వల్లే పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.

ఇది కూడా చదవండి: jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్‌లో పైచేయి ఎవ‌రిది? ప్రీపోల్ స‌ర్వేల‌దా? ఎగ్జిట్ పోల్ అంచ‌నాల‌దా?

“అన్ని వర్గాల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం ప్రత్యేకమైన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారాలు అందిస్తోంది,” అని తెలిపారు. గత ప్రభుత్వంలో మైనింగ్ అక్రమాలను ప్రస్తావిస్తూనే, ప్రస్తుతం మైనింగ్ రంగంలో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

విశాఖ భవితవ్యం: అంతర్జాతీయ గుర్తింపు

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ… గూగుల్ డేటా సెంటర్ ద్వారా విశాఖ నగరం అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని, గూగుల్ వస్తుందంటే ప్రజలు పండుగ చేసుకున్నారని తెలిపారు. విశాఖ భవిష్యత్తు కళ్ళముందే కనిపిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సి.ఎం. రమేష్ మాట్లాడుతూ… గతంలో జరిగిన ఎంవోయూలలో వంద శాతం ఇంప్లిమెంటేషన్ జరగలేదని, బోగస్ ఎంవోయూలు లేకుండా మంత్రి లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధిలో పవన్ కళ్యాణ్, లోకేష్ కాంబినేషన్ వేగంగా పనిచేస్తోందని, కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

ముందుచూపుతో పాలన: ప్రజల తీర్పు

పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ… ప్రజలకు రాష్ట్ర భవిష్యత్తు, ఎన్డీయే కూటమిపై పూర్తి అవగాహన ఉందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తున్నామని తెలిపారు.

“అభివృద్ధిపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు. ఆయన ప్రతి నిర్ణయం ముందుచూపుతో తీసుకుంటారు,” అని ప్రశంసించారు.

వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను, దోపిడీని (శాండ్, ల్యాండ్, వైన్) విశాఖ ప్రజలు తిరస్కరించారని, ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

కొల్లు రవీంద్ర మరోసారి సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతూ… ఆయన కేవలం విజనరీనే కాదు, ఒక బ్రాండ్ అని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని పేరుకున్నారు.

‘రైజింగ్ ఏపీ’ మహా కాంక్లేవ్ ద్వారా… సీఐఐ సదస్సు ద్వారా ఏపీకి రానున్న ప్రతిష్టాత్మక కంపెనీలు, పెట్టుబడుల ఆకర్షణ, ఏపీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌కు ఈ సదస్సు ఎలా బాటలు వేయబోతుందనే ప్రతి అంశంపై కూలంకషంగా చర్చ జరిగింది. జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు ‘నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’ అని సి.ఎం. రమేష్ చేసిన వ్యాఖ్య… కూటమి ప్రభుత్వంపై ప్రజలు, పారిశ్రామిక వర్గాలకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *