Madhya Pradesh: మంద్‌సౌర్ జిల్లా కచారియా గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి సమీపంలోని పాడుబడిన బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
అధికారుల ప్రకారం, ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) మరియు ఇతర సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్‌దా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు ప్రయాణికులు ఈదుకొని సురక్షితంగా బయటపడగలిగారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక, బావిలో ఉన్న విషపూరిత వాయువు కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని, బాధితులను రక్షించేందుకు ప్రయత్నించిన ఓ స్థానిక యువకుడూ ప్రాణాలు కోల్పోయినట్లు మంద్‌సౌర్ డీఐజీ మనోజ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
దీంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరిందని అధికారులు ధృవీకరించారు. బావిలో విషపూరిత వాయువు నిండి ఉండటం వల్ల మరణాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.