IPL 2025: ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఎవరుంటారు? ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లుగా ఇంకెవరు రిషభ్ పంత్ అని చెప్పడం తొందరపాటే అవుతుంది. ఎందకంటే మా జట్టులో నలుగురు కెప్టెన్లు ఉన్నారు. వారిలో ఎవరో ఒకరు నాయకత్వవం వహిస్తారంటూ బాంబులాంటి కామెంట్ చేశాడు లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా.. దీంతో జట్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
IPL 2025: లక్నో కొత్త కెప్టెన్ ఎవరు అనే విషయంలో ఊహాగానాలకు తావిచ్చాడు ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా. టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. లక్నో జట్టు కొత్త కెప్టెన్ రిషభేనా లేదంటే మాకోసం ఏదైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారా? అని చోప్రా ప్రశ్నకు బదులిస్తూ అవును.. కచ్చితంగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. మా జట్టులో రిషభ్, పూరన్, మార్కరమ్, మిచెల్ మార్ష్ రూపంలో నలుగురు కెప్టెన్లు అందుబాటులో ఉన్నారంటూ చెప్పాడు. దీంతో నికోలస్ పూరన్‌కు లక్నో పగ్గాలు అప్పగించేందుకు యాజమాన్యం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నా వరకైతే సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయితే, మా కెప్టెన్ ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తామంటూ ముక్తాయింపునిచ్చాడు. ఇక పంత్ ఓపెనర్‌గా వస్తాడా అన్న ప్రశ్నకు గోయెంకా సమాధానమిస్తూ.. మా మిడిలార్డర్‌ను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాం. వేలంలో బట్లర్ కోసం ప్రయత్నించాం. కానీ డబ్బు సరిపోలేదు. ఓపెనింగ్ జోడీపై జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్, మా కెప్టెన్ నిర్ణయం తీసుకుంటారన్నాడు.
IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు లక్నో.. వెస్టిండీస్ స్టార్ నికోలసన్ పూరన్ కోసం ఏకంగా రూ. 21 కోట్లు ఖర్చుచేస్తూ.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోనే కొనసాగిస్తూ ఈ మేరకు భారీ మొత్తం చెల్లించింది. అయితే, వేలంలో అనూహ్య రీతిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో పంత్ ధర రూ. 20 కోట్లకు చేరగా.. లక్నో ఒక్కసారిగా ఏడు కోట్లు పెంచింది. దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌ను లక్నో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో లక్నో జట్టు కొత్త కెప్టెన్‌గా పంత్ నియామకం లాంఛనమేనని క్రికెట్ విశ్లేషకులు భావించినా గోయెంకా వ్యాఖ్యలతో సస్పెన్స్ కొనసాగుతోంది.
IPL 2025: కాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంఛైజీకి మూడు సీజన్లపాటు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. తొలి రెండు ఎడిషన్లలో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. అయితే, ఈ ఏడాది మాత్రం టాప్-4లో నిలపలేకపోయాడు. ఈ క్రమంలో రిటెన్షన్‌కు ముందు లక్నో రాహుల్‌ను వదిలేయగా.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ. 14 కోట్లకు కొనుక్కుంది. ఢిల్లీకి ఆడిన పంత్ లక్నోకు చేరగా..లక్నోకు ఆడిన రాహుల్ ఢిల్లీ చేరాడు. ఇప్పుడు ఈ రెండు ఫ్రాంచైజీలకు కెప్టెన్ ఎవరు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.