LPG Gas: వంటగ్యాస్ వినియోగదారులపై ఒక్కసారిగా రూ.50 ధరల భారం పడింది. కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ ధరల భారం సామాన్యులపై పెనుభారం కానున్నది. దేశవ్యాప్తంగా పెరిగిన ఆ వంట గ్యాస్ ధరలు మంగళవారం (ఏప్రిల్ 8) నుంచి అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 చొప్పున పెరిగిన ఈ ధర ఉజ్వల పథకం సిలిండర్లపై కూడా పెరిగింది. ఉజ్వల పథకం సిలిండర్ ధర రూ.503 నుంచి రూ.533కు చేరింది. అదే విధంగా పెరిగిన ధరలను అనుసరించి గృహ అవసరాల సిలిండర్ ధర తెలంగాణలో రూ.855గా ఉన్న ధర రూ.905కు చేరగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.825గా ఉన్న సిలిండర్ ధర రూ.875కు చేరింది.
LPG Gas: తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ వినియోగం గణనీయంగా ఉన్నది. గణాంక అంచనాల ప్రకారం.. రాష్ట్రంలోని వినియోగదారులు నెలనెలా సుమారు ఒక కోటి వరకు వంట గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నట్టు అంచనా. అయితే ఈ ధరల పెరుగుదల నేరుగా వారిపై నెలకు అదనంగా రూ.50 కోట్ల భారాన్ని మోపనున్నది. ఇప్పటికే అధిక ధరలతో సతమతం అవుతున్న రాష్ట్రంలోని సామాన్య ప్రజానీకంపై మరింత భారం కానున్నది.
LPG Gas: సామాన్య ప్రజలతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైనా అదనపు భారం పడనున్నది. ఈ ధరల పెరుగుదల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంపై అదనపు ఆర్థిక భారం పడనున్నది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 42.90 లక్షల మంది లబ్ధిదారులక ప్రభుత్వం కేవలం రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నది. ఒకవేళ కేంద్రం సిలిండర్ ధర పెంచినా అదే ధరకు సిలిండర్‌ను అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. దీంతో ఆ రూ.50 చొప్పున అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీల రూపంలో లబ్ధిదారుల ఖాతాలోనే వేయనున్నది. ప్రతినెలా రూ.21.45 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భరించాల్సి ఉంటుంది.