Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లీ చలనం వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చాక కులగణన సర్వేతో కొంతకాలం, అసెంబ్లీలో బిల్లులతో మరికొంతకాలం రిజర్వేషన్ల అంశం వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత జీవోలతో మరికొంతకాలం నెట్టుకొచ్చింది. అయితే న్యాయస్థానంలో పిటిషన్ ఉన్నందున అసలు ఎన్నికల నిర్వహణపై సరైన గడువును న్యాయస్థానానికి ఇవ్వాల్సిన అనివార్యత ప్రభుత్వంపై ఏర్పడింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది.
Local Body Elections: స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణపై నవంబర్ 24లోగా రాష్ట్ర హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఈలోగానే ఎన్నికల ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లపై ఓ నిర్ణయం తీసుకొని, న్యాయస్థానానికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ నెల 15 లేదా 17న జరిగే రాష్ట్ర మంత్రి వర్గ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
Local Body Elections: ఈ మేరకు న్యాయస్థానానికి సమర్పించే నోట్‌ను తయారు చేయాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీచేసిందని సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై నోట్ తయారీలో నిమగ్నమైనట్టు తెలుస్తున్నది.
Local Body Elections: గత 20 నెలలుగా స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో హైకోర్టు కూడా ఎన్నికల నిర్వహణపై సరైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్న విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
Local Body Elections: రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో9కు న్యాయస్థానాల్లో కొందరు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారింది. దీనికోసం బీసీ సంఘాలు మాత్రం పట్టుదలతోనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి.
Local Body Elections: కానీ, ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపితే 42 శాతం సాధ్యం కాదని ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు 15 తర్వాత జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలుస్తున్నది. ఈ మేరకు పాత రిజర్వేషన్ల ప్రకారం.. బీసీలకు 25, ఎస్సీ 15, ఎస్టీ 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

