Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు నిన్ననే ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఈ రోజు (సెప్టెంబర్ 27) ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని విశ్వసనీయ సమాచారం. ఇదే రోజు కాస్త ఆలస్యంగా నోటిఫికేషన్‌ను కూడా జారీ చేస్తుందని తెలుస్తున్నది.
Local Body Elections: సెప్టెంబర్ 27న శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికలు నిర్వహించే గడువు, నిర్వహణ తీరుపై స్పష్టత వచ్చాక సాయంత్రంలోగా షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
Local Body Elections: విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ నెలలో 15 నుంచి 18 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. శనివారమే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేశాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా) ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. వడివడిగా ఎన్నికల ప్రక్రియ చేపడుతారని తెలుస్తున్నది.
Local Body Elections: పరిషత్ ఎన్నికలు ముందా? పంచాయతీ ఎన్నికలు ముందా? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉన్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున తొలుత పార్టీ గుర్తులపై జరిగే పరిషత్ ఎన్నికలే తొలుత నిర్వహించి, లబ్ధి పొందేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని భావిస్తున్నారు. దీంతో ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. ఈ ఎన్నికలు ముగిశాక వారం రోజుల గడువుతో పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నది.
Local Body Elections: ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే మూడు రోజుల వ్యవధిలోనే నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ టీపోల్‌లో అందుబాటులో ఉన్నాయి. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల సంఘం, మరోవైపు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచింది.
Local Body Elections: ఎన్నికల విధులపై అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉన్నా, గుర్తుల ముద్రణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేసి ఉంచింది. బ్యాలెట్ బాక్సులు భద్రపర్చడం, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, పోలీస్ భద్రత తదితర అంశాలపై కసరత్తును పూర్తి చేసింది.