Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై వేగవంతంగా కసరత్తు జరుగుతున్నది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపాలన్న ఆదేశాలతో సర్కారులో కదలిక వచ్చింది. బీసీ రిజర్వేషన్ల అంశం ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ఏకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్డినెన్స్ ఫైలు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. అది ఆమోదం పొందగానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనున్నది. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించే అవకాశం ఉన్నది.
Local Body Elections: ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసి ఉంచింది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయించింది. ఆ తర్వాతే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సర్కారు ఉన్నది. ఈ మేరకు ప్రాదేశిక ఎన్నికల నిర్వహణపై అధికార వర్గాలు అంతా సిద్ధం చేసి ఉంచాయి. పోలింగ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ కూడా ముగిసింది.
Local Body Elections: ఈ నేపథ్యంలో పోలింగ్ నిర్వహణ, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, స్టేషనరీ సామగ్రి అన్నింటినీ సిద్ధం ఉంచాలని ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులుగా బాధ్యతలు తీసుకోవాల్సిన కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. ఇదే సమయంలో బ్యాలెట్ పేపర్లను సైతం తయారు చేసి సిద్ధంగా ఉంచారని సమాచారం. ఈ మేరకు ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు, జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్లను వినియోగించనున్నారు.
Local Body Elections: ఒక్కో పోలింగ్ కేంద్రంలో 400 వరకు ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, నలుగురు పోలింగ్ అధికారులను నియమించాలని నిర్ణయించారు. 400 నుంచి 600 వరకు ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ఐదుగురు పోలింగ్ సిబ్బందిని నియమిస్తారు. తొలుత ఎంపీటీసీకి ఓటు వేసిన తర్వాత జడ్పీటీసీ బ్యాలెట్ పేపరు ఇస్తారు.