Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కోర్టుల్లో నిలువడం లేదు. ఇటు హైకోర్టులో స్టే విధించగా, నిన్న (అక్టోబర్ 16) సుప్రీంకోర్టు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో అయోమయం నెలకొన్న సమయంలోనే ఈ రోజు హైకోర్టు మరో ఆదేశాలు ఇచ్చింది.
Local Body Elections: ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై హైకోర్టులో కేసు ఉండగా, ఈ రోజు (అక్టోబర్ 17)న తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అసలు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే విషయాన్ని చెప్పేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన గడువునకు న్యాయస్థానం అంగీకరించింది.
Local Body Elections: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ కూడా జరిగింది. ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై మంత్రుల సమాలోచనలు చేశారు. న్యాయ కోవిదుల సలహా మేరకు ముందుకు సాగాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే జీవో 9పై 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై హైకోర్టు స్టే విధించింది.