Kurnool Bus Accident: నటుడు, సామాజిక వేత్త సోనూసూద్ మరో మానవీయ కోణంలో స్పందించారు. కొవిడ్ నుంచి ఆయన నిరంతర సేవలు వెలుగులోకి వస్తున్నాయి. ఆపద సమయాల్లో నేనున్నాను.. అంటూ పెద్ద ఎత్తున మానవీయ కోణంలో ఎంతో మందిని సోనూసూద్ ఆదుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున తయారయ్యారు. తాజాగా కర్నూలు బస్సు దహనం దుర్ఘటనపై ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక విలువైన సూచనను అందించారు.
Kurnool Bus Accident: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ సోనూసూద్ ఆ సూచనను అందించారు. ప్రతి లగ్జరీ బస్సులో ఎలక్ట్రిక్ ఎమర్జెన్సీ డోర్ కాకుండా మ్యాన్వల్లీ డోర్లు అమర్చాలి. ఈ మేరకు ఆపరేటర్లకు నెలపాటు గడువు ఇవ్వండి. పర్మిట్ రెన్యువల్ సమయంలో ఆపరేటర్లు డోర్ మార్చినట్టు ఫొటోలు అప్లోడ్ చేయాలని చెప్పండి. దీనిపై చర్యలు తీసుకోండి నితిన్ గడ్కరీ సార్.. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకండి.. అంటూ సోనూ సూద్ ట్వీట్ చేశారు.
Kurnool Bus Accident: ఇదిలా ఉండగా, కర్నూలు బస్సు దహనం దుర్ఘటనలో ఎలక్ట్రిక్ డోర్లు తెరుచుకోకపోవడంతోనే బస్సులోనే ఉన్న వారు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో బైకర్ సహా 20 మంది ప్రాణాలు విడిచారు. ప్రధాన డోర్తోపాటు డ్రైవర్ క్యాబిన్ డోర్ ఓపెన్ కాకపోవడంతో, మంటలు వెనువెంటనే వ్యాపించడంతో క్షణాల్లోనే ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనను తెలుసుకన్న సోనూ సూద్ దేశవ్యాప్తంగా మ్యాన్వల్ డోర్లు పెట్టేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్రమంత్రికి లేఖ రాశారు.

