Kunamneni sambhasivarao: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించడంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బాధ కూడా లేకపోవడం ఆశ్చర్యకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హైకోర్టు స్టే ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. “వారికి ప్రభుత్వంపై ద్వేషమా? లేక బీసీలపై ప్రేమలేదా?” అని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో మద్దతు తెలిపిన ఈ పార్టీలు ఇప్పుడు వెనక్కి తగ్గడమేంటి అని ఆయన నిలదీశారు. తమ పార్టీ బిల్లుకు మద్దతు తెలిపి, కేసులో కూడా ఇంప్లీడ్ అయ్యిందని వివరించారు.
రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, తమిళనాడులో 9వ షెడ్యూల్‌లో చేర్చి ప్రత్యేక పరిస్థితుల్లో అధిక రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం దానిని ఉపయోగించడం లేదని ఆయన విమర్శించారు.
“బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీయే అసలైన దోషి. ఆ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది,” అని కూనంనేని ఆరోపించారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని ఆయన సూచించారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల వ్యవస్థలో చారిత్రక ముందడుగు పడుతుందని సాంబశివరావు తెలిపారు.