Kunamneni sambasiva rao: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మరియు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో జరిగిన సీపీఐ జిల్లా సమితి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని, ఇది ప్రజలకు మోసం చేసిన ప్రాజెక్టుగా నిలిచిందని విమర్శించారు.
గత ప్రభుత్వం నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలపై భారీ ఆర్థిక భారం పడుతోందని, ఇకపై వేల కోట్ల రూపాయలు దాని నిర్వహణపై ఖర్చు చేయరాదని స్పష్టం చేశారు. “కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్” అని అంటున్న వాళ్లు ఇప్పుడు మౌనంగా ఉండిపోతున్నారని ఎద్దేవా చేశారు. తనే డిజైన్ చేశానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ బాధ్యతను ఇంజనీర్‌లపై వేసి తప్పించుకోవడం అన్యాయమన్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద 140 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టాలని తమ డిమాండ్ ఉన్నప్పటికీ, మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదని అర్ధంతరంగా ప్రాజెక్టును కాళేశ్వరానికి మార్చినట్టు హరీశ్ రావు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలను ముంచే విధంగా ప్రాజెక్టును మార్చడం ఏమిటని ప్రశ్నించారు.
కాళేశ్వరం నిర్మాణం తర్వాత అదనంగా నీరు ఇచ్చిన దాఖలాలు లేవని, ఇప్పటికీ పంటలకు ఎల్లంపల్లి నీరే ప్రధాన ఆధారమని తెలిపారు.
ఇక కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతూ, కమ్యూనిస్టులను నిర్మూలించేందుకు “ఆపరేషన్ కగార్” పేరుతో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకపోవడం దారుణమని అన్నారు. మావోయిస్టులు లొంగి చర్చలకు సిద్ధమన్నా, వారిని హతమార్చడం ఫ్యూడల్, గూండా, ఫాసిస్టు పాలనకు నిదర్శనమని విమర్శించారు.