Kumbh Mela 2025:తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాలో పాల్గొని యాత్రికులతో తిరిగి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బృందావన్ ప్రాంతంలో నిలిపి ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు.
Kumbh Mela 2025:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు కుంభమేళాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దుర్పత్తి అనే వృద్ధుడు సజీవ దహనం అయ్యాడని గుర్తించారు. ఇదే పల్సి గ్రామానికి చెందిన 8 మంది కూడా ఆ బస్సుల్లో వెళ్లారని గ్రామస్థులు తెలిపారు.
Kumbh Mela 2025:బస్సు ప్రమాద ఘటనతో పల్సి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన అధికారులు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ముథోల్ ఎమ్మెల్యే ప్రయాణికులను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి యాత్రికులను స్వస్థలాలకు తరలించాలని కోరారు. ఈ మేరకు అక్కడి పోలీస్, ఇతర అధికారులు చొరవ తీసుకొని ప్రత్యేక వాహనాల్లో యాత్రికులను తరలిస్తున్నారు. ఇంకా ఎవరికైనా గాయాలయ్యాయా? లేదా? అన్న విషయాలు తెలియాల్సి ఉన్నది.