KTR: తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ భారీ కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వినతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా అనుమతి ఇచ్చారు. ఇది కక్షసాధింపు చర్య అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రత్యారోపణలకు దిగారు. స్థానిక ఎన్నికల ముంగిట కేసు పేరిట డైవర్షన్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ దిగుతున్నదని వారు ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.
KTR: ఇదే దశలో కాంగ్రెస్ సర్కార్.. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలను చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ పేరిట 9,295 ఎకరాల పారిశ్రామిక భూములను సీఎం రేవంత్‌రెడ్డి ఏటీఎంగా మార్చుకునే కుట్రకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
KTR: సీఎం రేవంత్‌రెడ్డి తన బంధువులు, స్నేహితులకు పారిశ్రామికవాడ భూములను కట్టబెట్టేందుకు యత్నిస్తున్నాడని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆయా భూముల ద్వారా దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల కోట్ల భారీ స్కామ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెరలేపారని ఆరోపించారు. దీనివల్ల భవిష్యత్తులో సర్కారు సౌకర్యాలకు భూములు కరువయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
KTR: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రియల్ భూములు రెగ్యులరైజ్ చేయడానికి 100 శాతం, 200 శాతం ఫీజు చెల్లించాలని నిబంధనలు పెట్టామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. కానీ, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం.. ఏవీ రెడ్డి, కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి లాంటి బడా బాబులకు కేవలం 30 శాతం ఫీజు చెల్లిస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారని ఆరోపించారు.
KTR: 9,295 ఎకరాల ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఈ భూముల ద్వారా 30 శాతం ప్రభుత్వానికి వస్తే, మిగతా 60శాతం రేవంత్‌రెడ్డి దోచుకునే ప్రయత్నంలో ఉన్నాడని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూములపై రేవంత్ ముఠా వాలిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు.
KTR: ఇండస్ట్రియల్ భూమలును కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ పెద్ద స్కెచ్ వేసిందని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉన్న ప్రభుత్వ భూములను ఎవడబ్బ సొత్తని ప్రైవేటు గద్దలకు అమ్ముతున్నావ్.. అని కేటీఆర్ రేవంత్‌రెడ్డి సర్కార్‌ను ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తేల్చి చెప్పారు.
KTR: రేవంత్‌రెడ్డి అండ్ కో చేస్తున్న ఈ 9,295 ఎకరాల భూకుంభకోణంలో ఎవరూ ఇరుక్కోవద్దని కేటీఆర్ హితవు పలికారు. ఏమీ కాదులే అనుకొని ఎవరైనా ఆయా భూములను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో నష్టమే జరుగుతుందని హెచ్చరించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఈ కుంభకోణాన్ని బయటకు తీసి తగు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీచేశారు.

