KTR: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకున్నదని, దీనిపై 48 గంటల్లో బయటపెడతానని కేటీఆర్ వెల్లడించారు. ఆ వ్యవహారంలో సీఎంకు ఓ బీజేపీ ఎంపీ సహకరించారని ఆనాడే ఆయన ఆరోపించారు. ఆయన చెప్పినట్టుగానే ఈ రోజు (ఏప్రిల్ 11)న ఉదయం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు.
KTR: హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూముల వెనుక రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కార్ 10 వేల కోట్ల స్కామ్‌కు తెరలేపిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరపూరిత కుట్ర అని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఈ భూముల వ్యవహారం కోసం రూ.170 కోట్లను లంచంగా ఇచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీతో కుమ్మక్కై హెచ్‌సీయూ భూములను అమ్మాలని చూశారని కేటీఆర్ విమర్శించారు.
KTR: హెచ్‌సీయూ 400 ఎకరాల భూమి ముమ్మాటికీ అటవీ భూమి అని కేటీఆర్ స్పష్టం చేశారు. అడవికి ఉండే 0.4 క్యానపి అంటే అడవికి ఉండాల్సిన లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమి కిందికే వస్తుందని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తేల్చి చెప్పారు. దీంతోపాటు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది. ఆ భూముల మీద టీజీఐఐసీకి ఎటువంటి యాజమాన్య హక్కులు లేకున్నా ఆ భూములను తాకట్టు పెట్టిందని కేటీఆర్ విమర్శించారు.
KTR: ఈ భారీ కుంభకోణంలో క్విడ్ ప్రోకో జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. హెచ్‌సీయూ 400 ఎకరాల భూముల కుంభకోణంలో రేవంత్‌రెడ్డికి ఒక బీజేపీ ఎంపీ సహకరించాడని, తర్వాత ఎపిసోడ్‌లో ఆ బీజేపీ ఎంపీ పేరు బయట పెడతానని కేటీఆర్ వెల్లడించారు.
KTR: అటవీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అటవీ భూమిని తాకట్టు పెట్టడానికి, అమ్మడానికి ప్రయత్నించడం అతి పెద్ద ఆర్థిక నేరం అవుతుందని, ఈ అతిపెద్ద ఆర్థిక నేరానికి సీఎం రేవంత్‌రెడ్డి పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ భూమిని తాకట్టు పెట్టడానికి, అమ్మడానికి ప్రభుత్వానికి కూడా హక్కులు లేవని స్పష్టం చేశారు. భూముల బదలాయింపులు కూడా కాకముందే ఆర్థిక నేరానికి తెరలేపారని ఆరోపించారు.
KTR: ఈ హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న భారీ స్కాంపై విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్బీఐ, సీబీఐ, సీవీసీ, ఎస్ఎఫ్ఐవో, సెబీకి ఆధారాలతో సహా లేఖ రాసినట్టు చెప్పారు. సమగ్ర విచారణ జరిపి ఈ భారీ కుంభకోణాన్ని బహిర్గతం చేయాలని, భూముల ఆక్రమణను అడ్డుకోవాలని ఆయన ఆయా సంస్థలను కోరారు.
KTR: తనది కాని భూమిని టీజీఐఐసీతో తాకట్టు పెట్టించి, ఆర్‌బీఐ నిబంధనలను తుంగలో తొక్కి రూ.10,000 కోట్లను రేవంత్‌రెడ్డి సర్కార్ తెచ్చుకున్నదని కేటీఆర్ ఆరోపించారు. ఈ హెచ్‌సీయూ భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే సీఎం రేవంత్‌రెడ్డి.. టీజీఐఐసీకి బదిలీ చేశాడు కానీ, మ్యుటేషన్ చేయలేదని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా భూముల ధరలను మార్చి, లేని భూముల విలువను ఉన్నట్టు చూపి, ఆర్బీఐ నిబంధనలను అతిక్రమించాడని ఆరోపించారు.