KTR

KTR: కొత్త వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ విధింపుపై కేటీఆర్ ఆగ్రహం

KTR: తెలంగాణలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ పేరుతో అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ చర్య పేద, మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఇది ప్రజా వ్యతిరేక విధానమని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

సుప్రీంకోర్టు రహదారి ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, ఆ భారాన్ని ప్రభుత్వం భరించాల్సింది పోయి, ప్రజలపైకి నెట్టడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి రహదారుల భద్రతా ప్రమాణాలను పెంచకుండా, అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని చూడటం దారుణమని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఖజానాకు గండి:
‘హైడ్రా’ వంటి తప్పుడు విధానాలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికి ఇలాంటి పన్నులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తగా కొనే ప్రతి వాహనంపై రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు సెస్ వసూలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?:
అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజల నుంచి రూ. 270 కోట్లు ముక్కుపిండి వసూలు చేసేందుకు కుట్ర పన్నుతోందని కేటీఆర్ దుయ్యబట్టారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని లేదా అప్పు చేసి వాహనాలు కొనే సామాన్యుల జేబులు కొట్టే ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరని ఆయన హెచ్చరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *