KTR: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద వినూత్న నిరసనలకు దిగారు. గణపతి బప్ప మోరియా.. కావాలయ్యా యూరియా, యూరియా కొరతను తీర్చాలి.. రైతులను ఆదుకోవాలి అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతను నివారించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందంటూ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. అమరవీరులకు పూష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
KTR: ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా చర్చించేందుకు తాము సిద్ధమేనని చెప్పారు. వ్యవసాయ రంగంతోపాటు ఇతర ఏ అంశంపైనైనా చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు కూడా తామంతా రెడీయేనని చెప్పారు.
KTR: ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం గురించి కూడా తాము సమాధానం చెప్పి తీరుతామని కేటీఆర్ స్పష్టంచేశారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నదని, ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామని చెప్పారు. శాసనసభను తమకు అనుకూలంగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
KTR: రైతుల సమస్యలపై, ఎరువుల సంక్షోభంపై మాట్లాడటమే లేదని కేటీఆర్ చెప్పారు. 10 ఏండ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజూ ఎరువుల కొరత రాలేదని, రైతులు లైన్లలో నిలబడాల్సిన దుస్థితి చూడలేదని చెప్పారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెప్పులను లైన్లో పెట్టడం, ఆధార్ కార్డులను లైన్లో పెట్టే పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పండుగ రోజు కూడా రైతులు ఎరువుల కోసం లైన్లలో నిలబడి, వర్షంలోనూ తడిసి ఇబ్బందులు పడే పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు.
KTR: భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతుల గురించి, వారి ఇబ్బందుల గురించి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు అధికార పక్షం చర్చించే అవకాశం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన వ్యవసాయ సంక్షోభంపైనా చర్చ పెట్టాలని కోరారు. 600కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 75 లక్షల మంది రైతులు ఈ రోజుల అవస్థల్లో ఉన్నారని చెప్పారు. రైతులకు కాంగ్రెస్ చేసిన మోసాలపైనా చర్చ జరగాలని కోరారు.
KTR: ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే ఒకటి రెండు అంశాలపైనే మాట్లాడే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరంతోపాటు అన్ని అంశాలపైన సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాళేశ్వరంపై నివేదికి ఇచ్చింది పీసీ ఘోష్ కమిషన్ కాదని, అది పీసీసీ ఘోష్ కమిషన్ అని తూర్పారబట్టారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

