Ktr: జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా? బుల్డోజర్ కావాలా?

Ktr: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరగా, కేటీఆర్ వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు.

సభలో మాట్లాడుతూ కేటీఆర్ జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి, “జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా? బుల్డోజర్ కావాలా? నిర్ణయించుకోవాలి” అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనే మాట మాయం అయిపోయిందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని చెబుతూనే, ఇప్పటి వరకు ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆయన ప్రశ్నించారు. “రెండు సంవత్సరాలుగా ఎవరు అధికారంలో ఉన్నారో చెప్పండి. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి అంటున్నారు… అయితే ఇప్పటి వరకు ఏం చేసారు?” అని నిలదీశారు.

కేటీఆర్ మాట్లాడుతూ, ఈ బైపోల్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఓటు కోసం రూ.10,000 వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో వారు సంపాదించిన అవినీతి డబ్బునంతా జూబ్లీహిల్స్‌లో ఖర్చు పెడుతున్నారని అన్నారు.

బీజేపీపై కూడా ఆయన దాడి చేశారు. బీజేపీ రాష్ట్రానికి పనికిరాని పార్టీగా మారిందని, “కాంగ్రెస్‌కి, బీజేపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ తిరిగి అభివృద్ధి గాడిలో పడాలంటే కేసీఆర్ మళ్లీ రావాలని, ఆ మార్పు జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇక పేదల ఇళ్ల కూల్చివేతలపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. “గరీబోళ్ల ఇళ్లు ఎక్కడున్నాయో అక్కడికి బుల్డోజర్లు పంపిస్తున్నారు. కోర్టు ఆదేశాలు, చట్టబద్ధ పత్రాలు అన్నీ పక్కన పెట్టి పేదలపై దాడి చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు స్వరూపం” అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ఒక్క ఇల్లు కట్టకుండానే రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.

తన ప్రసంగం చివరగా ఆయన అన్నారు — “జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఎన్నికలో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు ₹4,000 పెన్షన్లు వస్తాయి. హైదరాబాద్ ప్రజల గుండెల్లో మళ్లీ అభివృద్ధి కారు నడవాలి.”

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *